తెలంగాణ‌లో మ‌రో కొత్త పార్టీ

Update: 2016-12-31 10:47 GMT
తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ ఊపిరి పోసుకోనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ఇటీవ‌లి కాలంలో పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు చేస్తున్న మాజీ జ‌డ్జి బెజ్జారం చంద్ర‌కుమార్ ఈ రాజ‌కీయ వేదిక‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం- సామాజిక ప్రజాస్వామ్యం ఉమ్మడి లక్ష్యంతో నూతన రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు తెలంగాణ ప్రజావేదిక అధ్యక్షులు జస్టిస్‌ (రిటైర్డ్‌) చంద్రకుమార్‌ ప్రకటించారు. ఫూలే - అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీ నిర్మాణానికి సంబంధించిన అవగాహన పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా చంద్రకుమార్‌ మాట్లాడుతూ...రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉందో, వారే అన్నింటినీ నిర్ణయిస్తున్నారని అన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు కేటాయించిన 27శాతం రిజర్వేషన్లు కూడా అమలు కావడం లేదని తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుచేస్తున్నవారు - అన్యాయాలు - అక్రమాలు - దౌర్జన్యం చేస్తున్నవారే అధికారంలోకి వస్తున్నారని చంద్ర‌కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు అధికారంలోకి రాగానే ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని విమర్శించారు. పాలకులు యువతరానికి నిరుద్యోగం - రైతులకు ఆత్మహత్యలు ఇస్తున్నారనీ మండిపడ్డారు. బడుగు - బలహీన ప్రజల ఆనందం కోసం నూతన రాజకీయ పార్టీ అవసరమని అన్నారు. టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్‌ - టీడీపీ - వైఎస్సార్‌సీపీ లాంటి పార్టీలు బడుగులకు వ్యతిరేకమని చంద్రకుమార్ అన్నారు. కొంగజపం చేస్తూ కొన్ని పార్టీలు సోషల్‌ జస్టీస్‌ పేరుతో వస్తున్నాయనీ, వారికింద పనిచేయలేమని అన్నారు.

ఇక తెలంగాణలో గడీల పాలన నడవదనీ, అందుకే నూతన పార్టీ తీసుకొస్తున్నామని చంద్ర‌కుమార్ చెప్పారు. నయీం కేసులో రాజకీయ నాయకులు, అధికారులకు సంబంధం లేదని ప్రకటించడానికి సర్కారుకు సిగ్గుండాలనీ ఆయన తీవ్రంగా విమర్శించారు. క్రిమినల్స్‌తో ప్రభుత్వం కుమ్ముక్కైందనడానికి ఇదే నిదర్శమని అన్నారు. సీఎం చంద్ర‌బాబు తెలంగాణ స‌మాజంలో మార్పు తీసుకువ‌స్తార‌ని ఆశించిన వారికి నిరాశే మిగిలేలా ప‌రిపాల‌న చేస్తున్నార‌ని చంద్ర‌కుమార్ ఫైర్ అయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News