సుప్రీం మాజీ జడ్జి అంత మాట అనేశారేంటి?

Update: 2015-12-06 10:55 GMT
న్యాయమూర్తుల ఆగ్రహం ధర్మాగ్రహంగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో చాలా ఎక్కువ. సుదీర్ఘకాలం న్యాయమూర్తులుగా వ్యవహరించిన వారు.. రిటైర్ అయ్యాక కూడా అదే అలవాటును కంటిన్యూ చేస్తారు. ఆసక్తి కలిగించేలా మాట్లాడటానికి వారు పెద్దగా ఇష్టపడరు. వీలైనంత వరకూ సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వటానికి.. ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.

అందుకు భిన్నంగా.. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు సాగుతున్న విషయం తెలిసిందే. తమ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. హైకోర్టు విభజన చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. ఏపీలో హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటూ ఏపీ నేతలు అడుగుతున్నారు.

హడావుడిగా జరిపిన విభజన పుణ్యమా అని.. కొన్ని అంశాల విభజన విషయంలో ఆచితూచి అడుగులు వేయటం కనిపిస్తుంది. ఇది పలువురికి అసహనాన్ని కలిగిస్తోంది. విభజన జరిపి దాదాపు 19 నెలలు గడుస్తున్నా.. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయకపోవటంపై తెలంగాణ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది.  ఇదిలా ఉంటే తాజాగా ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు విభజన కానీ రెండేళ్లలో పూర్తి కాని పక్షంలో  తెలంగాణ జిల్లాల్లో తెలంగాణకు చెందిన జడ్జిలు ఉండరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొవటానికి తెలంగాణ పాలకులు ప్రయత్నిస్తున్నట్లు లేదని వ్యాఖ్యానించారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. హైకోర్టు విభజన విషయంలో గత కొద్దికాలం ఘాటైన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ అధికారపక్షం కొద్దిరోజులుగా కామ్ గా ఉన్న నేపథ్యంలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి తాజాగా చేసిన వ్యాఖ్యలు కదలిక తేవొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News