పాల్ సంచ‌ల‌నం!... జ‌గ‌న్ అరెస్ట్ ఆయ‌న ప‌నేన‌ట‌!

Update: 2019-03-06 11:02 GMT
క్రైస్త‌వ మ‌త బోధ‌కుడిగా జ‌నాల‌కు ప‌రిచ‌యం అయ్యి... ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ ప్ర‌జా శాంతి పార్టీ పేరిట ఓ పొలిటిక‌ల్ పార్టీ పెట్టిన కేఏ పాల్ త‌న‌దైన కామెడీని పండించ‌డంలో శాయ‌శక్తులా క‌ష్ట‌ప‌డుతున్నార‌నే చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డా క‌నిపించ‌ని పాల్‌... ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌న‌గానే... ఏపీలో పూర్తి స్థాయిలో ల్యాండైపోయారు. దిగీ దిగ‌గానే... త‌న‌దైన మార్కు సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ జ‌నం దృష్టిని ఇట్టే ఆక‌ట్టుకున్న పాల్‌... ఇప్పుడు సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఏపీ విప‌క్ష నేత‌,  వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరెస్ట్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించిన పాల్... నాడు జ‌గ‌న్‌ను అరెస్ట్ చేయించింది తానేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒక్క ఫోన్ కాల్ కొడితే... జ‌గ‌న్ జైల్లో వెళ్లి ప‌డ్డార‌న్న కోణంలో పాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్నాయి. అయినా పాల్ ఫోన్ కొట్ట‌డ‌మేంటీ? జ‌గ‌న్ అరెస్ట్ కావ‌డ‌మేంటీ? అన్న సంశ‌యాలు మ‌దిలో మెద‌ల‌క‌ముందే.... ఆ నేప‌థ్యం కూడా ఏమిటో పాల్ చెప్పేశారు. 2012లో కేంద్రంలో యూపీఏ స‌ర్కారే ఉంది క‌దా. యూపీఏ చైర్ ప‌ర్స‌న్‌గా ఉన్న సోనియా గాంధీ... ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఉన్నా... మొత్తం వ్య‌వ‌హారం అంతా న‌డిపార‌న్న వాద‌న తెలిసిందే క‌దా. సోనియా గాంధీకి రాజ‌కీయ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారుగా ఉన్న అహ్మ‌ద్ ప‌టేల్ అంటే ఎంత న‌మ్మ‌క‌మో కూడా మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు.

ప‌టేల్ ఓకే అన్నారంటే... సోనియా ఓకే అన్న మాటే. అలాంటి అహ్మ‌ద్ ప‌టేల్... పాల్‌కు ఆప్తి మిత్రుడ‌ట‌. ఆ మితృత్వం ఎలా ఏర్ప‌డిందో పాల్ చెప్ప‌లేదు గానీ... 2012, మే 22న తాను అహ్మ‌ద్ ప‌టేల్ ను ఫోన్ చేసి జ‌గ‌న్‌ను అరెస్ట్ చేయ‌మ‌ని చెప్పిన‌ట్టుగా పాల్ చెప్పారు. త‌నతో ఫోన్ లో మాట్లాడిన మరుక్ష‌ణ‌మే అహ్మ‌ద్ ప‌టేల్ ఇదే విష‌యాన్ని సోనియా చెవిన వేశార‌ని, వెంట‌నే జ‌గ‌న్ అరెస్ట్ చేయండంటూ సీబీఐకి ఆదేశాలు జారీ అయ్యాయ‌ని పాల్ ప్పుకొచ్చారు. అంటే తాను కొట్టిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో జ‌గ‌న్ ఏకంగా అరెస్టై... చంచ‌ల్ గూడ జైలుకు చేరార‌న్న మాట‌. ఈ విష‌యంలో ఎంత మేర వాస్త‌వ‌ముంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తూ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం మాత్రం ఆసక్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

    

Tags:    

Similar News