అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అనేసిన మరో హీరోగారు!

Update: 2019-04-20 06:29 GMT
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాట పోటీ చేసిన కమల్ హాసన్ పార్టీకి అక్కడ అంత మెరుగైన ఫలితాలు ఏమీ రావనే అంచనాలున్నాయి. తమిళనాట కమల్ పార్టీ గొప్ప విజయం సాధించే అవకాశాలు ఏవీ ఉండవని, కేవలం పోటీ నామమాత్రమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ తరఫున లోక్ సభ నియోజకవర్గాల్లో ఎంపీలుగా పోటీ చేసిన వార డిపాజిట్లను సాధిస్తే అదే గగనం అని విశ్లేషకులు అంటూ ఉన్నారు.

తన పార్టీ విషయంలో అలాంటి అంచనాలు వినిపిస్తున్నా, నటుడు కమల్ హాసన్ మాత్రం నిస్పృహకు గురికావడం లేదు. ఇక పూర్తి కాలం రాజకీయాలే అని కమల్ స్పష్టం చేస్తున్నారు. ఇక తన జీవితం రాజకీయాలకే అంకితం అని కమల్ అంటున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బోల్తా పడినా.. వెనుదిరిగే పరిస్థితి లేదని, లోక్ సభ ఎన్నికల అనంతరం తమిళనాడు అసెంబ్లీకి సార్వత్రిక  ఎన్నికలో, మధ్యంతర ఎన్నికలో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ తదుపరి టార్గెట్ అవేనని కమల్ ప్రకటించారు.

తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో రెడీ అవుతున్నట్టుగా కమల్ ప్రకటించారు. కమల్ ఉత్సాహం అయితే బాగానే ఉంది కానీ, లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ఫలితాలను పొందుతుంది? అనేదాన్ని బట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పై ఒక అభిప్రాయం కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కొద్దో గొప్పోగా సత్తా చూపిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ పార్టీని జనాలు పట్టించుకుంటారని అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇప్పటికే తన టార్గెట్ తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికలే  అని రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  కమల్  కూడా.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అంటున్నారు!
Tags:    

Similar News