సీఎంగారు సొంత ఖర్చులతో విదేశీ పర్యటనకు!

Update: 2019-06-29 04:38 GMT
నేతల విదేశీ పర్యటనలు తరచూ వివాదాస్పదం అవుతూ ఉన్నాయి. ఏపీలో అయితేనేం.. జాతీయ స్థాయిలో అయితేనేం…అలాంటి విదేశీ పర్యటనలు తరచూ వివాదస్పదం అవుతున్నాయి. ఏపీలో ఇది వరకటి ఆర్థిక శాఖా మంత్రి యనమల కృష్ణుడు పన్ను పీకించుకోవడానికి సింగపూర్ కు వెళ్లి అభాసుపాలయ్యారు.

ఆ అంశంపై జాతీయ మీడియాలో కూడా చర్చ జరిగింది. చిన్నపాటి డెంటల్ క్లీనిక్ లో చేసే వైద్యానికి సింగపూర్ వరకూ వెళ్లి ప్రజాధనాన్ని రీయింబర్స్ చేయించుకున్నారు యనమల. ఆ అంశంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటికే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనల విషయంలో తీవ్ర విమర్శల పాలయ్యారు. దానికి తోడు యనమల లాంటి వాళ్లు కూడా అలా చేయడంపై ప్రజల నుంచి అసహనం వ్యక్తం అయ్యింది.

ఆ డబ్బును తను తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తున్నట్టుగా యనమల ప్రకటించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం  జరిగింది. దొరికితే వెనక్కు ఇవ్వడం, దొరకకపోతే అట్టే పెట్టుకోవడమా.. అని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నించారు.

ఇక తాజాగా కర్ణాటకలోనూ అలాంటి రచ్చే ఒకటి తెర మీదకు వచ్చింది. త్వరలో కుమారస్వామి అమెరికా పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు. ఇప్పటికే కుమారస్వామి విలాసాలపై విమర్శలున్నాయి. ఇటీవల గ్రామంలో నిద్ర అంటూ కుమారస్వామి ప్రభుత్వ ఖాతా నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టించారు. దానికి సంబంధించిన విమర్శల హోరు తగ్గకనే అమెరికా పర్యటన అనే ప్రచారంతో కుమారస్వామిపై విమర్శలు  మరింత పెరిగాయి.

ఇలాంటి నేపథ్యంలో.. కుమారస్వామి వివరణ ఇచ్చుకున్నారు. తను తన సొంత ఖర్చుతో అమెరికా పర్యటనకు వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ప్రభుత్వ సొమ్మును వాడుకోవడం లేదని తేల్చి చెప్పారు. తద్వారా విమర్శల హోరును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారాయన.
Tags:    

Similar News