తెలంగాణలో మంత్రుల మధ్య పోటీ

Update: 2015-12-31 07:08 GMT
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఏమాత్రం అవకాశం లేని స్థానాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహ రచనతో దక్కించుకోవడం తెలిసిందే. ఆయన సాధించిన ఆ ఘనత ఇప్పుడు నల్గొండలో మరో మంత్రి జగదీశ్ రెడ్డి పదవికి ఎసరుపెట్టేస్థాయికి వచ్చింది. ఏమాత్రం అవకాశంలేని ఖమ్మంలో విజయం సాధించినప్పుడు మంచి ఛాన్సు ఉన్న నల్గొండలో ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ కు కోల్పోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. నల్గొండ సీటు కోల్పోవడం జగదీశ్ రెడ్డి వైఫల్యమే అని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు కూడా జగదీశ్ రెడ్డి విషయంలో పలుమార్లు కేసీఆర్ ఆగ్రహించిన సందర్భాలున్నాయి. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని గతంలోనూ ప్రచారం జరిగింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో జగదీశ్ పదవికి గండం తప్పదని అనుకుంటున్నారు.
    
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ ఎస్ పార్టీ హవా కొనసాగినా నల్గొండలో మాత్రం అధికారపార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను అన్ని జిల్లాల మంత్రులు నెరవేర్చినా నల్గొండలో మాత్రం మంత్రి గుంతకళ్ల జగదీశ్‌ రెడ్డి మాత్రం తిలోదకాలు ఇవ్వడంపై పార్టీ అధినేత మంత్రిపై తీవ్ర గుస్సాగా ఉన్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ గెలుపు బాధ్యతలను చేపట్టిన తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆమేరకు విజయం సాధించారు. ఏమాత్రం బలంలేని ఖమ్మం స్థానంలో మంత్రి తుమ్మల పావులు కదిపి సాధించిన గెలుపుపై సీఎం సంతోషం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.  నల్గొండ జిల్లాలో జరిగిన ఏకైక ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలుపు బాధ్యతలను మంత్రి జగదీశ్‌ రెడ్డికి అప్పగించినా ఆయన నోటి దురుసుతనంతో పార్టీ అభ్యర్థి తేరా చిన్నపురెడ్డి ఘోరంగా ఓడిపోయినట్లు పార్టీ వర్గాలు కేసీఆర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజయ్యను తీసేసినట్లు జగదీశ్ ను కూడా తీసేస్తారంటూ జోరుగా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
    
తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్‌ రెడ్డికి సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే ఆయన మంత్రి హోదాలో ఉంటూ నోటిదురుసుగా మాట్లాడడంపై పలు మార్లు తీవ్ర వివాదాలు చెలరేగాయి. అసెంబ్లీలో సైతం ఆయన నోటి దురుసుతనంతో పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు క్షమాపణ చెప్పిన సందర్భాలున్నాయి. నల్గొండలో అధికారపార్టీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోవడంతో మంత్రి జగదీశ్‌ రెడ్డిపై వేటు పడుతుందంటూ పార్టీలోని సీనియర్ నేతలు సైతం అంటున్నారు.  గతంలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు శాఖ మార్చిన సంగతి తెలిసిందే. ఈసారి ఆ ఛాన్సు ఉండదని.. మొత్తానికే ఎసరొస్తుందని తెలుస్తోంది.
    
అయితే... జగదీశ్ మాత్రం తుమ్మలతో కంపేర్ చేస్తే ఎలా అని... జిల్లాకు జిల్లాకు పరిస్తితులు మారుతాయని అంటున్నారట. తుమ్మలతో కంపేర్ చేసి తన పదవికి ఎసరు తెస్తే ఏం చేయాలా అని వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
Tags:    

Similar News