మూడింటికి ఓకే చెప్పి.. మొత్తంగా 30 చేసిన కేసీఆర్

Update: 2016-10-03 05:29 GMT
కేసీఆర్ స్టైలే వేరుగా ఉంటుంది. ఇది సాధ్యమా? కుదురుతుందా? లాంటి ప్రశ్నలు ఆయన దగ్గర కనిపించవు. అనుకున్నామా? చేయాలా? అంటే.. ఇంక దేని గురించి ఆలోచించకుండా చేసుకుంటూ పోవటమే ఆయన తీరుగా ఉంటుంది. నచ్చనప్పుడు ఎంత కఠినంగా ఉంటారో.. నచ్చినప్పుడు అంతకు రెట్టింపు ఉదారంగా ఉంటుంది. మరింత ఆసక్తికర అంశం ఏమిటంటే.. విషయం ఏదైనా.. నిర్ణయం వేగంగా ఉంటుంది. తాజాగా అలాంటి వేగాన్నే ప్రదర్శించారు కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటుకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు ఆయనో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకూ అనుకున్నట్లు 17 కొత్త జిల్లాల స్థానే.. మరో మూడు కొత్త జిల్లాలకు అనుకూలంగా నిర్ణయం తీసేసుకున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ ఎస్ మంత్రులు.. ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయిలో భేటీ నిర్వహించిన ఆయన.. కొత్త జిల్లాలపై అభిప్రాయాల్ని జిల్లాల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తీసుకున్ననిర్ణయం.. తీసుకోవాల్సిన అంశాల మీద ఆయన దృష్టి సారించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మహబూబ్ నగర్.. కరీంనగర్.. వరంగల్ జిల్లాల్లో కొత్త జిల్లాల కోసం పెద్ద ఎత్తున సాగుతున్న పోరాటానికి తలొగ్గిన ఆయన.. ప్రజలు కోరుకుంటున్నట్లుగా గద్వాల.. సిరిసిల్ల.. జనగామ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసే విషయాన్ని ప్రస్తావించటం.. అలానే చేసేద్దామని చెప్పేయటం జరిగిపోయింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలి కదా? ఇప్పుడు మళ్లీ కొత్త జిల్లాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది కదా? ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ మూడు కొత్త జిల్లాలా? చిన్న రాష్ట్రంలో 30 జిల్లాల్ని ఏర్పాటు చేయటమా? లాంటి ఎన్నో సందేహాలు సొంత పార్టీ నేతలు సంధించిన వేళ.. వాటికి కూల్ గా రియాక్ట్ అయిన ముఖ్యమంత్రి.. వాటి సంగతి తాను చూసుకుంటానని ఒక్క మాటలో భరోసా ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు. నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాల్సిన అవసరం లేదని.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పిన కేసీఆర్.. ప్రజలు కోరుకుంటున్నట్లుగా కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తే పోయేదేముందన్నట్లుగా మాట్లాడినట్లు తెలిసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది వేల మందికో జిల్లా ఉందని.. దాంతో పోల్చినప్పుడు ఇప్పుడు అనుకుంటున్న మూడు జిల్లాలు అంతకంటే మెరుగ్గానే ఉంటాయి కదా అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.

ప్రజల నుంచి బలంగా డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. ప్రజలు పెట్టుకున్న ఆశల్ని తీర్చాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతల ముందు వ్యక్తం చేయటం ద్వారా.. మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు తాను సానుకూలంగా ఉన్న సంకేతాన్ని ఆయన ఇచ్చేశారు. ‘‘అందరూ సంతోషంగా ఉండాలి. కొత్త జిల్లాల మీద అందరూ ఆనందంగా ఉండే వేళ.. కొంతమంది నారాజ్ గా ఉండటం ఎందుకు? ప్రజలు కోరుకుంటున్నట్లుగా మరో మూడు జిల్లాల్ని ఇద్దాం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లుగా ఆయా జిల్లాల కలెక్టర్లకు కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు చూడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో.. దసరా నుంచి తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాలు 17 స్థానే.. 20 కానున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News