మోడీని కేసీఆర్ సరిగా డీల్ చేయలేదా?

Update: 2016-05-12 05:14 GMT
రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ అయిన సంగతి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని కరవు గురించి ప్రధాని మోడీ దగ్గర ప్రస్తావించటమే కాదు.. కేంద్రం నుంచి తమకు సరైన సాయం అందట్లేదని ఫిర్యాదు చేశారు. కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణ సర్కారుకు వెయ్యి కోట్లు తక్షణ సాయంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సంపన్న రాష్ట్రంగా తరచూ ప్రస్తావించే తెలంగాణలో తీవ్రమైన కరవు ఉన్న విషయాన్ని ప్రధాని మోడీ చెప్పేంత వరకూ ఆయన కరవుపై స్పందించకపోవటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. కరవుతో నానా కష్టాలు పడుతున్న తెలంగాణ ప్రజానికానికి ఈతిబాధల గురించి ఇప్పటివరకూ పెదవి విప్పని సీఎం కేసీఆర్.. వారిని ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా ఏం చేశారన్నది ఆయనకే తెలియాలి. కరవుతో విలవిలలాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కారు తనకు తానుగా ఏం చేసిందన్న ప్రశ్న ఒకటైతే.. ప్రధాని మోడీ దగ్గర తమ కష్టాల్ని ఏకరవు పెట్టి.. సాయం కోసం అర్థించే ముందు ఒక్కసారి కూడా ఆయన కరవు తీవ్రత గురించి ప్రస్తావించకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

కేంద్రాన్ని సాయం అడగటం తప్పు లేదు కానీ.. అడిగే తీరుతోనే సమస్య అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి సాయాన్ని కోరి.. కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవటమే లక్ష్యమైనప్పుడు.. కరవు తీవ్రతను ప్రధానికి అర్థమయ్యేలాచెప్పి.. ఆయన్ను ఒప్పించటం ముఖ్యమే తప్ప.. ఫిర్యాదుగా ప్రధానితో మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న. మోడీ లాంటి మైండ్ సెట్ ఉన్న నేతను డీల్ చేసే విషయంలో తప్పులు జరిగితే అది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేకూరుస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సమస్యల్ని ప్రస్తావించటం తప్పు లేదు కానీ.. వాటిని ప్రొజెక్ట్ చేసిన తీరు సరిగా లేదన్న వాదన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి తన దృష్టికి తీసుకొచ్చిన కరవు అంశంపై ప్రధాని ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.
Tags:    

Similar News