బాబు కోలుకోలేని దెబ్బ తీసే స్కెచ్ వేసిన కేసీఆర్‌

Update: 2018-05-08 04:14 GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు భారీ నాటకానికి తెరతీయడం, తెలంగాణ ఏసీబీ ఛేదించడం తెలిసిందే. ఈ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరన్న ధీమాతో బాబు తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో వేలుపెట్టే ప్రయత్నంచేశారని, డ్రామాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. దీంతోపాటు కాంగ్రెస్ నేత‌ల అంతు చూసేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. ఉమ్మడి రాష్ట్రాన్ని 60 ఏళ్ల‌పాటు పాలించిన కాంగ్రెస్ - టీడీపీలు తెలంగాణ భూములను కబ్జా చేయడంతోపాటు కొందరు నేతలు కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపై సమగ్ర విచారణకు రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేసి - సత్వరమే పరిష్కరించే దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో చంద్రబాబు - కాంగ్రెస్ నాయకులపై నమోదైన కేసుల వివరాలను సోమవారం ఏసీబీ - విజిలెన్స్ - సీఐడీ తదితర శాఖల అధికారులు సీఎం కేసీఆర్‌ కు నివేదించారు. చంద్రబాబు 1999లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిపిన ప్రతీ భూదందా - ఆపద్ధర్మ సీఎంగా చేసిన భూ కేటాయింపులు - వాటిపై కాంగ్రెస్ హయాంలో నమోదైన ఏసీబీ - విజిలెన్స్ - సీఐడీ కేసుల వివరాలకు సంబంధించి వందల సంఖ్యలో ఫైళ్లను సీఎం ముందుంచారు. వీటన్నింటిపై విచారణ చేయించాల్సిన అవసరం ఉన్నదని, కేసుల విచారణ పూర్తిచేయకుండా మిగిలిపోయినందున కమిషన్ వంటిదాన్ని వేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్ హయాంలోని అక్రమాలపై ఒక కమిషన్ - టీడీపీ హయాంలో అక్రమాలపై మరో కమిషన్ వేయాలన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేసినట్టు తెలిసింది.

టీఆర్ ఎస్ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా చంద్రబాబునాయుడు పదవినుంచి దిగిపోతూ - అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ భూములను అప్పనంగా పందేరం చేశారన్న ఆరోపణలున్నాయి. వీటిపై పక్కా ఆధారాలతో ఏసీబీ - సీఐడీ - విజిలెన్స్-ఎన్‌ ఫోర్స్‌ మెంట్ విభాగాలు కేసులు పెట్టాయి. లక్షల కోట్ల విలువైన భూములను కారుచౌకగా తనవారికి అప్పగించారని - బినామీ కంపెనీలను సృష్టించి భూములను తన ఖాతాలోకి మళ్లించుకున్నారని బాబుపై ఆరోపణలు వచ్చాయి. ఇవి వాస్తవమేనని తేలాయి. శంషాబాద్‌ లో అత్యంత విలువైన 850 ఎకరాలను ఐఎంజీ అనే సంస్థకు కట్టబెట్టారు. ఇక్కడ ఎకరాన్ని రూ.50 వేలకు ధారాదత్తంచేశారు. ఐఎంజీలో చంద్రబాబుకు బినామీగా, ఆయనతో దగ్గరి స్నేహం ఉందని చెప్పే బిల్లీరావుకు 99.9% వాటాలున్నాయి. ఇక హైదరాబాద్‌ లోని క్రికెట్ స్టేడియాలను కూడా బిల్లీరావుకు చెందిన బినామీ కంపెనీలకు ధారాదత్తంచేశారు. ఇక బాబు హయాంలోనే రహేజా సంస్థకు అడ్డగోలుగా భూ కేటాయింపులు చేశారు. ఇదే కోవలో పోలేపల్లి సెజ్ - మాదాపూర్ - మణికొండ ఐటీ పార్కులకు - ఎమ్మార్ ప్రాపర్టీస్‌ కు భూములు ఇచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ లో గోల్ఫ్‌ కోర్సు పేరిట భూపందేరానికి అడ్డూఅదుపూ లేదు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ లో అంతా బాబు బినామీలేనని - ఎమ్మార్ స్థలాల పక్కనే చంద్రబాబుకు భూములున్నాయని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 26,634 ఎకరాల భూములను వివిధ కంపెనీలకు ఇస్తే వీటిలో సుమారు 10వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కలవే కావడం గమనార్హం. వాస్తవానికి అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోరాదనే నిబంధన ఉన్నా.. ఉల్లంఘించారు. దీన్ని ప్రశ్నిస్తూ అనేకమంది కోర్టులను ఆశ్రయించారు. నేటికీ కేసులున్నాయి. ఆనాడు నమోదైన ఏసీబీ - విజిలెన్స్ కేసులు ఇంకా ఉన్నాయని తాజా భేటీలో తేలిన‌ట్లు సమాచారం. అందుకే ప్ర‌త్యేక క‌మిష‌న్ వేసి మ‌రీ నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News