తెలంగాణ స‌ర్కారు సంగ‌తేంది కేసీఆర్‌?

Update: 2018-03-10 06:08 GMT
కొత్తొక వింత‌. పాతొక రోత అని ఊరికే అన‌లేదేమో?  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చూస్తే.. ఈ సామెత చ‌ప్పున గుర్తుకురాక మాన‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక కొత్త విష‌యంలో ఆయ‌న బిజీబిజీగా ఉంటారు. దీంతో పాత విష‌యాల మీద దృష్టి పెట్టే అవ‌కాశం ఆయ‌న‌కు ఉండ‌దు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన నాలుగేళ్ల‌లో ప్ర‌ణాళికా బ‌ద్ధంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు ఏమైనా ఉన్నాయా? అంటూ భూత‌ద్దం వేసుకొని చూడాల్సిందే. ప్ర‌భుత్వ‌ప‌రంగా.. పాల‌నా ప‌రంగా ఏదీ ఒక క్ర‌మ‌ప‌ద్ధతిలో జ‌రుగుతున్న‌ట్లు అస్స‌లు క‌నిపించ‌దు. ఏదో జ‌రుగుతుందంటే జ‌రుగుతుంద‌న్న‌ట్లుగా ఉంటుంది.

ఎక్క‌డిదాకానో ఎందుకు.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి సెక్ర‌టేరియ‌ట్‌కు రాకుండా పాల‌న చేయ‌టం చూశామా?  ఆ ముచ్చ‌ట‌ను తీర్చేశారు కేసీఆర్‌. ఆయ‌న‌కు తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ న‌చ్చ‌లేదు. ఆయ‌న‌కు న‌చ్చిన‌ట్లుగా క‌ట్టుకునేందుకు విప‌క్షాలు మొద‌లు.. తెలంగాణ ప్ర‌జ‌ల వ‌ర‌కూ క‌లిసి రావ‌టం లేదు. దీనికి తోడు ఎక్క‌డ సెక్ర‌టేరియ‌ట్ క‌ట్టాల‌నుకున్నా.. ఏదో ఒక స‌మ‌స్య ఆయ‌న్ను వెంటాడుతోంది. ఎందుకిలా అన్న‌ది ఆయ‌న ఆలోచించ‌రు. ఒక‌వేళ ఆలోచించినా.. అది ప్ర‌జ‌ల కోణంలో కాకుండా.. త‌న కోణంలోనే ఆలోచించ‌టంతో ఆయ‌న ఆలోచ‌న‌లు మ‌రోలా ఉంటాయే త‌ప్పించి.. ప్ర‌జ‌ల మ‌న‌సులకు ద‌గ్గ‌ర‌గా ఉండ‌దు.

తెలంగాణ ఉద్య‌మ నేత‌గా ఉన్న వేళ‌.. ప్ర‌జ‌ల ఆశ‌లు.. ఆకాంక్ష‌ల్ని అనుస‌రించి అడుగులు వేసేవారు. అదే స‌మ‌యంలో త‌న‌కున్న ఆలోచ‌న‌లకు ప్ర‌జామోదం పొందేలా చేసేవారు. సీఎం అయ్యాక కేసీఆర్ లో ఆ ల‌క్ష‌ణం మిస్ అయ్యింద‌ని చెప్పాలి.  కొంత‌కాలం హామీల ప‌ర్వం.. మ‌రికొంత‌కాలం స‌భ‌లు.. స‌మావేశాలు నిర్వ‌హించ‌టం.. ఆపై వివిధ పేర్ల‌తో ఉత్సవాలు నిర్వ‌హించ‌టం.. మొన్న‌టి వ‌ర‌కూ కొత్త కొత్త ప‌థ‌కాల్ని తెర మీద‌కు తీసుకొచ్చేందుకు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి సారించారు.

దీంతో.. గ‌డిచిన‌కొన్నేళ్లుగా పాల‌నా ప‌రంగా దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతున్నారు. రాష్ట్రాధినేత‌గా ఆఫీసుకు వెళ్ల‌టం.. ఫైళ్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క్లియ‌ర్ చేస్తే పాల‌నాప‌రంగా ఇబ్బందులు ఉండ‌వు. అధికారులు సైతం అలెర్ట్ గా ఉంటారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే లేద‌ని చెబుతున్నారు. ఎప్పుడు ఏది గుర్తుకు వ‌స్తే దాన్ని చేయ‌ట‌మే కాదు.. ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ఏదీ సాగ‌టం లేద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. గ‌డిచిన కొద్ది రోజులుగా వివిధ వ‌ర్గాల‌కు చెందిన నిపుణుల్ని.. ప్ర‌ముఖుల్ని త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల మీద దృష్టి సారించిన‌ట్లు చెబుతున్నారు. థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సంద‌ర్భంగా జాతిని ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించాల్సి ఉంటుంది. ఆ సంద‌ర్భంగా దేశ స‌మ‌స్య‌ల మీద అవ‌గాహ‌న‌తో పాటు.. ప‌ట్టు తెచ్చుకోవ‌టంలో ఆయ‌న బిజీగా ఉన్నార‌ని చెబుతున్నారు. అవ‌న్నీ బాగానే ఉన్నా.. రాష్ట్రానికి సంబంధించిన కీల‌క అంశాలు కేసీఆర్ కు పట్ట‌టం లేదంటున్నారు. త‌న తీరుతో ఇప్ప‌టికే వ్య‌వ‌స్థ‌ల ప‌ని తీరుపై త‌న‌దైన ప్ర‌భావాన్ని చూపిన కేసీఆర్‌.. తాజా వైఖ‌రితో మ‌రిన్ని స‌మ‌స్య‌ల్ని తెచ్చేలా ఆయ‌న వైఖ‌రి ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News