వెనక్కి తగ్గితే సొమ్ములు పోతాయా? అంత ఈగో ఎందుకు బాబు? అన్నట్లుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవన్న చిన్న విషయాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని నయానా.. భయానా ఒప్పించాలే తప్పించి.. విషయాన్ని తెగే వరకూ లాగకూడదన్న చిన్న లాజిక్ ను అంత పెద్ద కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారన్నది ప్రశ్న.
రోడ్ల మీదకు వచ్చి రచ్చ చేయటం వదిలేయండి.. కనీసం సోషల్ మీడియాలో ఏ ఒక్కరైనా ఆర్టీసీ కార్మికుల సమ్మెను బలుపు చర్యగా అభివర్ణిస్తూ పోస్ట్ చేస్తారు. ఇవాల్టి రోజున ఇష్యూ ఏదైనా.. తమకు సంబంధం ఉన్నా లేకున్నా.. హాట్ టాపిక్ గా ఉన్న ప్రతి అంశంపైనా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ స్పందిస్తున్నారు. సమ్మె నిర్ణయంపై సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరూ తప్పు పట్టలేదు. అదే సమయంలో.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపైనా విమర్శలు ఇప్పటికైతే రాలేదు.
కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చెప్పక తప్పదు. ఇప్పటికే కేసీఆర్ అనుసరిస్తున్న తీరును తప్పు పడుతూ.. పలు వాట్సాప్ గ్రూపుల్లో ఆర్టీసీ ఉద్యోగులు ఆడిన బతుకమ్మ పాటలు వైరల్ అవుతున్నాయి. సమ్మె చేస్తున్న వైనాన్ని మరే ముఖ్యమంత్రి అయినా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే మరోలా ఉండేది. అంత పెద్ద ఉద్యమాన్ని నిర్వహించిన కేసీఆర్ లాంటి నేత వేలాది మంది ఉద్యోగుల్ని తీసేసినట్లుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని ఏమనాలి?
తరచూ సంపన్న రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్.. పక్కనున్న ఏపీ ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. తెలంగాణలో ఎందుకు జరగకూడదన్న ప్రశ్న హేతుబద్దతతో కూడుకున్నదే. అప్పులకుప్పలో కూరుకుపోయిన ఏపీలాంటి చోటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. సంపన్న తెలంగాణలో అదెందుకు సాధ్యం కాదన్న ప్రశ్న సామాన్యుడిలో కలగటమే కాదు.. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలుస్తారని చెప్పక తప్పదు. తెగే వరకూ లాగి సాధించేది ఉండదన్న విషయాన్ని కేసీఆర్ లాంటి మేధావికి తెలీకపోవటమేమిటి.. కాల వైచిత్రి కాక.