బీ రెడీ సిగ్న‌ల్ ఇచ్చేసిన కేసీఆర్!

Update: 2018-06-22 05:28 GMT
దాదాపు ఆరేడు నెల‌ల త‌ర్వాత మొద‌లు కావాల్సిన ఎన్నిక‌ల వేడి.. ఇప్పుడే మొద‌లైంది. ప్ర‌ధాని మోడీ మ‌న‌సులో  జ‌మిలి ఎన్నిక‌లపై బ‌లంగా ఉన్న మ‌మ‌కారం దేశ రాజ‌కీయాల్లో మ‌రో మార్పున‌కు శ్రీ‌కారం చుడుతుంద‌ని చెబుతున్నారు. అసెంబ్లీకి వేరుగా.. లోక్ స‌భ‌కు వేరుగా ఎన్నిక‌ల‌కు వెళితే త‌మ‌కు అందాల్సిన రాజ‌కీయ ప్ర‌యోజ‌నం అంద‌కుండా పోతుంద‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లు చెబుతారు. ఇందుకు జ‌మిలి ఎన్నిక‌ల మీద ఆయ‌న దృష్టి పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యాక తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరులో మార్పు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ఏ క్ష‌ణంలో వ‌చ్చినా అందుకు త‌గ్గ‌ట్లుగా ప్ర‌భుత్వ విధానాలు.. పార్టీ తీరు ఉండాల‌న్నట్లుగా ఉంది.  పెండింగ్ ప‌నుల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలంటూ ఉన్న‌తాధికారుల ఆదేశాల‌తో పాటు.. మంత్రులు త‌మ శాఖాధికారుల‌తో స‌మీక్ష‌ల జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది.

దీనంత‌టికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు కేసీఆర్ సిద్ధం కావ‌ట‌మేన‌ని చెబుతున్నారు. టార్గెట్ న‌వంబ‌రు ల‌క్ష్యంగా చేసుకొని పార్టీని ఎన్నిక‌ల‌కు సంసిద్ధం చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్ర‌కారం చూస్తే వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌.. మేల్లో అసెంబ్లీకి.. లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. జ‌మిలి ఎన్నిక‌ల్లో భాగంగా నాలుగైదు నెల‌లు ముంద‌స్తుగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నం చేస్తోంది.

దీనిపై త‌న తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని ద‌గ్గ‌ర కాస్తంత క్లారిటీ తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఎన్నిక‌లు ఏ క్షణంలో అయినా  వ‌చ్చే వీలుంది. ఇందుకు త‌గ్గ‌ట్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవ‌టంతో పాటు.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని దోచుకునేలా ప్ర‌భుత్వ విధానాలు ఉండాల‌ని.. అందుకు అవ‌స‌ర‌మైన స‌న్న‌ద్ధ‌త దిశ‌గా అడుగులు వేయాల‌ని గులాబీ దండుకు కేసీఆర్ సందేశాన్ని ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌తో పాటు.. వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు సైతం న‌వంబ‌రులో ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించ‌టాన్ని గుర్తుచేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన నాటి నుంచి కేసీఆర్ మాట‌లో ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాలు ప‌దే ప‌దే వ‌స్తున్నాయ‌ని.. న‌వంబ‌రు నాటికి అంతా సిద్ధంగా ఉండాల‌న్న మాట‌ను చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే వివిధ ద‌శ‌ల్లో ఉన్న అభివృద్ధి ప‌నుల్ని న‌వంబ‌రు నాటికి పూర్తి చేసేలా ప్లానింగ్ ఉండాల‌ని కోరుతున్న‌ట్లు చెబుతున్నారు.

న‌వంబ‌రు త‌ర్వాత ఏ క్ష‌ణంలో అయినా ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే ఏర్పాట్లు మొత్తం పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల‌తో భేటీ సంద‌ర్భంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఉంద‌న్న మాట‌ను కేసీఆరే స్వ‌యంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే పెండింగ్ ప‌నులు అస్స‌లు ఉంచొద్ద‌ని.. యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేయాల‌ని ఆదేశాలుజారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా త‌న ప‌రివారానికి.. అనుచ‌ర వ‌ర్గాన్ని బీ అలెర్ట్ అంటూ కేసీఆర్ సందేశాన్ని పంపిన‌ట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News