నోరు జారద్దు అంటున్న కేసీఆర్

Update: 2016-12-16 05:48 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త‌న మంత్రి వ‌ర్గానికి  - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల నేప‌థ్యంలో తెలంగాణభవన్‌ లో జరిగిన టీఆర్‌ ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ  ఇతర శాసనసభలకు భిన్నంగా తెలంగాణ శాసనసభ గత రెండున్నరేళ్ళుగా హుందాగా సాగుతోందని - సభా గౌరవాన్ని కాపాడుతూ సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుందామని అన్నారు. విపక్షాలకు ప్రశ్నించడానికి అంశాలేం లేవని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. మంత్రులు తమ శాఖలకు సంబంధించి అవగాహనతో ఉండాలని, సభ్యులు అప్రమత్తతతో వ్యవహరించాలని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. సమాచారంతోనే పైచేయి సాధించాలని, ఏ దశలోనూ విపక్ష సభ్యులపై నోరు జారొద్దని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

ప్రతి ప్రశ్నకు సావదానంగా సమాధానం చెబుదామని కేసీఆర్ ప్ర‌తిపాదించారు. "మనం ప్రజలకు చెప్పుకోవాల్సింది చాలా ఉంది. చేసింది చెప్పుకోవడం లేదు.. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ప్రగతిని వివరిద్దాం. సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు తగిన సమాచారంతో సిద్దం కావాలి" అని స్ప‌ష్టం చేశారు. ప్రతి సభ్యుడూ విధిగా సమావేశాలకు హాజరుకావాలని, అర్ధవంతమైన చర్చకు వేదికగా సభను నిర్వహిద్దామన్నారు. ఈనెల 16నుండి 30వరకు సభను నిర్వహించాలని నిర్ణయించామని, అవసరమైతే గడువు పొడిగిద్దామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. శాసనసభ సభ్యులంతా విధిగా సభకు హాజరుకావాలని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజ ల్లోకి తీసుకెళ్ళేందుకు దీనిని వినియోగించుకోవాలన్నారు.

నోట్లరద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమని, ఈ ఇబ్బందులను దేశంలోనే తొలిసారి తానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. నోట్లరద్దును వ్యతిరేకించడం వల్ల ప్రజలకు, రాష్ట్రానికి కలిగే మేలేమీ లేదన్నారు. నోట్ల రద్దును అందరూ సమర్ధిస్తున్నారని, అయితే ప్రజల ఇబ్బందులను పరిష్క రించాలని టీఆర్‌ఎస్‌ కోరుతున్నదన్నారు. నోట్ల రద్దు అనేది టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, దీని పర్యవసానాలు కేంద్రంపైనే ప్రభావం చూపుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుపై పేదవర్గాల్లో సాను కూలత ఉందని, నోట్ల రద్దు అనంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నోట్లరద్దు పర్యవసానం ప్రస్తుతం ప్రజలను ఇబ్బందిపెడుతున్నా.. అది ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. చెప్పలేమన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News