మీడియా అధినేత‌ల‌కు కొత్త క‌ష్టం తెచ్చిన కేసీఆర్‌

Update: 2017-10-08 06:51 GMT
పాత్రికేయం అంటే ఒక‌రి ప‌క్షాన నిల‌వ‌టం ఎంత మాత్రం కాదు. ఉన్న నిజాన్ని ఉన్న‌ట్లుగా చెప్ప‌టం. ఒక‌వేళ వాస్త‌వం చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంటే.. ఆ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌క‌నే చెప్పేలా చేయాల్సిన బాధ్య‌త మీడియా మీద ఉంటుంది. వాస్త‌వానికి ప్ర‌జ‌ల‌కు మధ్య వార‌ధిగా నిలుస్తూ.. ప్ర‌జా సంక్షేమం కోసం అహ‌ర‌హం అన్న‌ట్లుగా శ్ర‌మించాల్సిన బాధ్య‌త మీడియా మీద ఉంది.

అందుకే.. ఎన్ని వృత్తులు.. వ్యాపారాలు ఉన్నా.. మీడియా అన్న వెంట‌నే ఇచ్చే మ‌ర్యాద‌.. గౌర‌వం ఒకింత ఎక్కువ‌గా ఉంటుంది. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా.. మీడియా రంగు.. రుచి.. వాస‌న మారిపోయింద‌ని చెప్పాలి.  ప్ర‌జ‌ల క్షేమం కోసం కంక‌ణ‌బ‌ద్ధులై ఉండాల్సిన పాత్రికేయం.. త‌మ అవ‌స‌రాల‌కు.. త‌మ ఇష్టాల‌కు త‌గిన‌ట్లుగా మారిపోయిన దౌర్భాగ్యం వ‌ర్త‌మానంలో క‌నిపిస్తుంది.

త‌మ వ్య‌క్తిగ‌త‌ ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేస్తూ వ్య‌వ‌హ‌రించే తీరు నేటిత‌రం మీడియా అధినేత‌ల్లో స్ప‌ష్టం క‌నిపిస్తుంది. అంద‌రూ కాకున్నా.. కొంద‌రిలో ఈ తీరు ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇక‌.. కాస్త ప్ర‌మాణాలు పాటించే వారు సైతం ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌టం క‌నిపిస్తోంది. త‌మ వ్యాపార ప్ర‌యోజ‌నాల‌కు సంస్థ ప్ర‌యోజ‌నాల్ని కాపాడేందుకు రాజీ ప‌డాల్సి వ‌స్తుంద‌న్న మాట‌ను చెబుతున్నారు.

అధికార‌ప‌క్షానికి వ్య‌తిరేకంగా.. విప‌క్ష పాత్ర పోషించాల్సిన పాత్రికేయం ఇప్పుడు అందుకు భిన్నంగా ప‌వ‌ర్ కు స‌న్నిహితంగా ఉంటూ.. వారి ప్ర‌యోజ‌నాల్ని ఎప్ప‌టిక‌ప్పుడు కాపాడే ర‌క్ష‌కుడి పాత్ర‌ను పోషించ‌టం ఈ మ‌ధ్య‌న కొత్త‌గా అబ్బిన ల‌క్ష‌ణంగా చెప్పాలి. మీడియా సంస్థ‌ల‌కు త‌గ్గ‌ట్లే మీడియాలో ప‌ని చేసే వారు సైతం.. య‌జ‌మానులు చెప్పిన‌ట్లుగా కిమ్మ‌న‌కుండా ప‌ని చేసుకుంటూ పోతున్నారే త‌ప్పించి.. అదేంటండి? ఈ ప‌ద్ధ‌తి అన్న ప్ర‌శ్న నోటి నుంచి రావ‌ట్లేదు.

సంస్థ బాగుంటేనే తాము బాగుంటామ‌న్న భావ‌న అస‌లుసిస‌లు ఉద్యోగులుగా మారిన పాత్రికేయుల పుణ్య‌మా అని తెలుగు మీడియా అంత‌కంత‌కూ కునారిల్లిపోతోంది. ఎవ‌రికి వారు వారి వారి కుటుంబాల ఆర్థిక ఉన్న‌తిని కోరుకోవ‌టం మిన‌హా.. విలువ‌లు వాడిపోయి.. కుళ్లిపోవ‌టాన్ని ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇలాంటి వేళ‌లోనూ.. తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ మీడియా అధినేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింద‌న్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ కు చెక్క భ‌జ‌న చేసే ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయాయి. త‌మ అభిమాన క‌థానాయ‌కుడైన కేసీఆర్‌ను కోదండ‌రామ్ మాష్టార్ని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన వైనాన్ని ఎలా స‌మ‌ర్థించాలి?  హీరోయిక్ గా ఎలా ప్రొజెక్ట్ చేయాల‌న్న‌ది అర్థం కావ‌ట్లేద‌ట‌. దీంతో.. ఒక ప్ర‌ముఖ మీడియా కేసీఆర్ తిట్ల‌ను త‌న‌దైన శైలిలో కాస్త టోన్ డౌన్ చేసి చూపిస్తే.. మ‌రో ప్ర‌ధాన మీడియా మాత్రం కేసీఆర్ మాట‌ల్ని కోట్స్ లో పెట్టేసి.. ఆయ‌న ఏమ‌న్నారో దాన్ని అచ్చేసి త‌నకున్న‌ ద‌మ్ము పేరు డ్యామేజ్ కాకుండా జాగ్ర‌త్త ప‌డింది. ఇక‌.. మ‌రో ప్ర‌ధాన మీడియా మాత్రం కేసీఆర్ మీద క‌డుపు నిండా క‌సి ఉన్నా.. ఆ విష‌యం కేసీఆర్ అర్థ‌మై.. క‌న్నెర్ర చేసే క‌ష్టం కాబ‌ట్టి చూసీచూడ‌న‌ట్లుగా ఉండిపోయింది.

కేసీఆర్ తిట్ల వ‌ర్షం తాలూకు క‌ష్టం మీడియా సంస్థ‌ల‌కు ఇక్క‌డితో ఆగిపోవ‌టం లేదు. చైత‌న్య‌వంత‌మైన తెలంగాణ స‌మాజం.. ఇక‌పై కేసీఆర్ ను త‌ప్పు ప‌ట్టే వ్యాసాల్ని రాసే ప‌ని మొద‌లు పెడ‌తారు. వాటిని అచ్చేసే విష‌యంలో మీడియాకు ఎద‌ర‌య్యే త‌ల‌నొప్పులు అన్నిఇన్ని కావంటున్నారు. ఏమైనా.. త‌న తాజా ప్రెస్ మీట్ తో సొంత పార్టీ నేత‌ల్నే కాదు.. త‌న‌కు అండ‌గా నిలిచేందుకు త‌హ‌త‌హ‌లాడే మీడియా అధినేత‌ల్ని కేసీఆర్ క‌ష్ట‌పెట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News