ఏపీలో దేవుడి తీర్పును కేసీఆర్ లైట్ తీసుకున్నారా?

Update: 2019-06-07 07:30 GMT
ఎంత అన్యాయం?  ఎంత దారుణం?  దేవుడు అనేవాడు ఉంటే.. ఈ దుర్మార్గానికి త‌గిన బుద్ధి చెబుతాడు?  ఆశ ఉండాలే కానీ మ‌రీ ఇంత అత్యాశ‌?  మాట ఏదైనా భావం ఒక్క‌టే. బాధితుల నోట్లో నుంచి వ‌చ్చే ఈ త‌ర‌హా మాట‌ల‌కు దేవుడు స‌మాధానం ఇచ్చిన తీరు ఈ మ‌ధ్య‌న ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు.

చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని అన్యాయంగా.. అక్ర‌మంగా పార్టీ మారేలా చేశారు. దీనిపై నాడు విపక్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌లుసంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు. బాబు దుర్మార్గానికి పరాకాష్ఠ‌గా 23 మంది ఎమ్మెల్యేల్ని కొనేయ‌టాన్ని అభివ‌ర్ణించేవారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవ‌ల వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే.. విచిత్రంగా ఏపీలో టీడీపీకి కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలే రావ‌టం ఆస‌క్తిక‌రంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. అన్యాయంగా విప‌క్ష పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని త‌న‌వైపు లాక్కున్న బాబుకు దేవుడు భ‌లేగా బుద్ధి చెప్పార‌ని.. ఆయ‌న లాక్కున్న మందంగా మాత్ర‌మే ఎమ్మెల్యేల్ని మిగిల్చి దేవుడు బుద్ధి చెప్పార‌న్న మాట ఏపీ సీఎం జ‌గ‌న్ నోటి నుంచి ప‌దే ప‌దే వ‌చ్చింది.

ఈ మాట‌ల్ని చూసిన‌ప్పుడు అక్ర‌మ ప‌ద్ద‌తిలో పార్టీలోకి ఎమ్మెల్యేల్ని మార్చ‌టం అంత మంచిది కాద‌నే విష‌యం అర్థం కావ‌ట‌మే కాదు.. దేవుడు అనేవాడు ఉన్నాడ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. దేవుడ్ని విపరీతంగా న‌మ్మే కేసీఆర్ కు.. ఏపీ ఎపిసోడ్ ను ప‌ట్టించుకోలేదా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

తాను లాక్కున్న మందంగా మాత్ర‌మే చంద్ర‌బాబుకు ఎమ్మెల్యేలు మిగిలిన వైనం కేసీఆర్ దృష్టిలో పడ‌కుండా ఉంటుందా? అందులోకి న‌మ్మ‌కాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చే కేసీఆర్.. బాబుకు ఎదురైన చేదు అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొనైనా విలీన ప్ర‌క్రియ‌ను కాస్త ఆలోచించి తీసుకుంటే మంచిగా ఉండేద‌ని చెబుతున్నారు.  స్వార్థ రాజ‌కీయాల‌కు చెక్ పెట్టేలా ఉన్న దేవుడి తీరును కేసీఆర్ లైట్ తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా చెప్పాలి. మ‌రి.. ఆయ‌న ఎంత మూల్యం చెల్లిస్తార‌న్న‌ది కాలం మాత్ర‌మే బ‌దులివ్వ‌గ‌ల‌దు.  
Tags:    

Similar News