కేసీఆర్ ఏం చేసి ఉండొచ్చు..?

Update: 2015-10-08 17:30 GMT
రైతు ఆత్మహత్యలు - ఒకే దఫాలో రైతు రుణ మాఫీకి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వానికి మార్గమే లేదా? రూ.8000 కోట్లను ఒకే దఫాలో చెల్లించలేదా? ప్రజలు - విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిందేనా? ఈ ప్రశ్నలకు కాదు అని జవాబు చెబుతున్నారు విశ్లేషకులు.

రైతు రుణాలు మొత్తం దాదాపు రూ.20 వేల కోట్లు ఉన్నప్పుడు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అంత మొత్తం మాఫీ చేయడానికి నిరాకరించింది. ఐదేళ్లలో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయదని అనుమానించి, మాఫీకి మోకాలడ్డింది. అయితే, ఇప్పుడు మాఫీ మొత్తం కేవలం రూ.8000 కోట్లు. వచ్చే ఏడాది బడ్జెట్ లో అంటే ఏప్రిల్ లో ప్రభుత్వం దీనికి రూ.4000 కోట్లు కేటాయిస్తుంది. ఆ తర్వాత కావాల్సింది కేవలం రూ.4000 కోట్లు. బడ్జెట్ కు ఇంకా ఐదు నెలల సమయం ఉంది. అంటే ఏడాదిన్నరలో ఎనిమిది వేల కోట్లు ఎలాగూ ఖర్చు చేస్తుంది. ఐదు నెలల్లో రూ.4000 కోట్లు తిరిగి చెల్లించేస్తామని, మరో ఏడాదిలో మిగిలిన రూ.4000 కోట్లు చెల్లించేస్తామని ఆర్బీఐని కోరితే కాదనే అవకాశం ఉండకపోవచ్చు. అందుకు ప్రభుత్వం గ్యారెంటీలు కూడా ఇవ్వవచ్చు. రెండేళ్లపాటు క్రమం తప్పకుండా రుణ మాఫీ చేసింది కనక ఆర్బీఐ కూడా అంగీకరించవచ్చు. అదే సమయంలో, వివిధ కార్పొరేషన్ల నుంచి రుణం తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండనే ఉంది. అంతేనా.. ఇండియా క్రెడిట్ రేటింగ్ ప్రకారం తెలంగాణ ఏ ప్లస్ లో ఉంది. అంటే, తక్కువ వడ్డీకి ఎంత కావాలంటే అంతరుణం ఇవ్వడానికి దేశ, విదేశీ సంస్థలు క్యూ కడతాయి. వీటికితోడు రూ.8000 కోట్లను సమీకరించడానికి ప్రభుత్వానికి ఎన్నా మార్గాలు ఉన్నాయి.

అయితే, ఇప్పుడు రుణ మాఫీని ఒకేదఫా చేయడానికి సిద్ధపడితే, ఆ క్రెడిట్ ప్రభుత్వానికి రాదు. అదంతా ప్రతిపక్షాలకు పోతుంది. అందుకే కేసీఆర్ అస్సలు ఆ డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. అయితే, ఒకే దఫా రుణ మాఫీ డిమాండ్ ను కేసీఆర్ ఎంత కాలం పక్కన పెడితే అంత కాలం ఆయన ప్రభుత్వం ప్రజల్లో బద్నాం అవుతూనే ఉంటుంది. రైతు ఆత్మహత్యలు పెరిగే కొద్దీ ప్రభుత్వంతోపాటు కేసీఆర్ కూడా పలుచన అవుతూనే ఉంటారు.
Tags:    

Similar News