హైద‌రాబాద్‌ లో జ‌ర్నీ చేస్తే కేసీఆర్ ఇంకేం అంటారో?

Update: 2017-05-02 06:11 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు చాలానే చేయాల‌ని ఉంటుంది. అందుకోసం ఆయ‌న చాలానే క‌ల‌లు కంటుంటారు. ఆయ‌న‌తో వ‌చ్చే స‌మ‌స్య ఏమిటంటే.. ఆయ‌న క‌ల‌ల కార‌ణంగా చాలానే స‌మ‌యం వృధా అవుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ ఎప్పుడు ఏ క‌ల కంటారో? ఏ క‌ల‌కు ఎలా రియాక్ట్ అవుతారో ఎంత‌కూ అర్థం కాదు. కేసీఆర్‌ తో చిక్కేమంటే.. ఆయ‌న క‌ల క‌నే వాటిలోనే కాదు.. వాస్త‌వంలో కూడా ఆయ‌న క‌న్వీన్స్ కావ‌టం.. స‌మ‌స్య తీవ్ర‌త ఆయ‌న‌కు నేరుగా అనుభ‌వంలోకి వ‌స్తే త‌ప్పించి ఆయ‌న రియాక్ట్ కారు.

ఆ మ‌ధ్య‌న భారీగా కురిసిన వ‌ర్షాల దెబ్బ‌కు హైద‌రాబాద్ రోడ్లు ఆగ‌మాగం అయిపోవ‌ట‌మే కాదు.. భారీ ఎత్తున ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఈ విష‌యం మీద మీడియా మొద‌లు.. సామాన్యుడు వ‌ర‌కూ ఎవ‌రెంత మొత్తుకున్నా ఆయ‌న పెద్ద‌గా రియాక్ట్ అయ్యింది లేదు. చివ‌ర‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ సైతం రోడ్ల దుస్థితి మీద తీవ్రంగా రియాక్ట్ కావ‌ట‌మే కాదు.. అధికారుల‌కు డెడ్ లైన్ విధించిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది లేదు.

తెలంగాణ రాష్ట్ర స‌ర్కారులో అత్యంత కీల‌క‌మైన స్థానంలో ఉండి.. ఆయ‌న మాటే వేదంగా ఫీల‌య్యే అధికారులు సైతం స‌మ‌స్య తీవ్ర‌త‌ను త‌గ్గించ‌టంలో విఫ‌లం కావ‌టంపై చాలానే విమ‌ర్శ‌లు రావ‌ట‌మే కాదు.. కేటీఆర్ స‌మ‌ర్థ‌త మీద కూడా కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పులు వ‌చ్చింది లేదు.

కొద్ది నెల‌లుగా సా..గుతున్న ప‌నుల కార‌ణంగా రోడ్ల ప‌రిస్థితి గ‌తంతో పోలిస్తే మెరుగ్గా మారినా.. మొత్తంగా అయితే మారింది లేద‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న వ‌రంగ‌ల్ వెళ్లిన సంద‌ర్భంలో పాల‌కుర్తి రోడ్డు మీద ప్ర‌యాణించే స‌మ‌యంలో కేసీఆర్ కంటికి గుంత‌లు క‌నిపించాయి. అంతే.. సోమ‌వారం రివ్యూ మీటింగ్ పెట్టి అధికారుల‌కు వార్నింగ్ ఇవ్వ‌ట‌మే కాదు.. నెల రోజులే టైం ఇస్తున్నాన‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గుంత క‌నిపించినా ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ర‌హ‌దారుల‌కు భారీగా నిధులు కేటాయించినా గుంత‌లు క‌నిపించ‌టంపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తాను జూన్ 1న రాష్ట్ర ప‌ర్య‌ట‌న చేస్తాన‌ని.. అప్పుడు గుంత‌లు క‌నిపిస్తే మాత్రం ఊరుకునేది లేద‌న్నారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న దాకా ఎందుకు కేసీఆర్‌.. హైద‌రాబాద్‌ లో రెగ్యుల‌ర్ గా వెళ్లే రూట్ల‌ను వ‌దిలేసి.. నాలుగైదు బ‌స్తీల్లో స‌ర్ ప్రైజ్ విజిట్ చేసేస్తే స‌రి.. రోడ్ల‌కు ఎన్ని గుంత‌లు ఉన్నాయో అర్థ‌మ‌వుతుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. కేసీఆర్ దృష్టికి ఇలాంటి స‌ల‌హాలు వెళ‌తాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News