ముచ్చ‌ట‌గా మూడో అడుగు వేసిన కేసీఆర్‌!

Update: 2018-03-06 04:43 GMT
ఏమాట‌కు ఆ మాటే చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదైనా ప‌ని మొద‌లెడితే.. దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చే వ‌ర‌కూ వ‌ద‌ల‌రు. ఒక‌సారి వ‌దిలారంటే మ‌ళ్లీ ప‌ట్టించుకోవ‌టం ఎప్పుడ‌న్న‌ది ఆయ‌న‌కు కూడా తెలీద‌న్న స‌ర‌దా వ్యాఖ్య‌ను ఆయ‌న స‌న్నిహితులు చేస్తుంటారు. ఇంకో ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే.. ఏదైనా విష‌యాన్ని టేక‌ప్ చేసి అప్ప‌టిక‌ప్పుడు హైప్ క్రియేట్ చేసేలా చేయ‌టం.. అంద‌రూ త‌న మాట మీద దృష్టి నిలిపేలా చేయ‌టం..క‌న్వీన్స్ చేయ‌టం.. కొత్త ఆశ‌ల్ని రేకెత్తించ‌టం లాంటివి చేసేస్తారు.

ఇలాంటి మాట‌లు ఎందుకు?  ఒక ఉదాహ‌ర‌ణ చెప్పండ‌ని అంటారా?  ఓకే. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల కార్య‌క్ర‌మాన్నే తీసుకోండి. ఈ కార్య‌క్ర‌మం ప్రారంభంలో తెలుగు భాష విష‌యంపై కేసీఆర్ చెప్పిన మాట‌ల్ని గుర్తుకు తెచ్చుకోండి. తెలుగు మీద కేసీఆర్‌కున్న ప్రేమాభిమానాల‌కు తెలుగువారంతా మురిసిపోయారు. పేరుకు తెలుగు స‌భ‌లే అయిన‌ప్ప‌టికీ తెలంగాణ ప్రాంతానికే ప‌రిమితం చేయ‌ట‌మే కాదు.. ఏపీ విష‌యంలో ఎంత నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించారో తెలిసిందే. ఈ వైఖ‌రి ఆయ‌నపై విమ‌ర్శ‌లుగా మారే టైంలో.. టాలీవుడ్ మొత్తాన్ని ఒకే వేదిక మీద‌కు తీసుకురావ‌టం ద్వారా.. ఎంత క‌వ‌ర్ చేయాలో అంత క‌వ‌ర్ చేశారు.

తెలుగు మ‌హాస‌భ‌ల ఆరంభంలో తెలుగు మీద ప్రేమ‌నంతా ఒల‌క‌బోసిన కేసీఆర్‌.. ముగింపు సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న భావ‌న క‌లిగేలా చేశారు. ఇన్నాళ్ల‌కు తెలుగు మీద ఇంత ప్రేమ‌ను ప్రద‌ర్శించ‌ట‌మే కాదు.. తెలుగు ఉన్న‌తి కోసం భారీ ప్ర‌క‌ట‌న ఏదో కేసీఆర్ నుంచి వ‌స్తుంద‌న్న భావ‌న క‌లిగేలా చేశారు. తీరా చూస్తే.. ముగింపు సంద‌ర్భంగా ఆయ‌నేం మాట్లాడారో అంద‌రికి తెలిసిందే.

తెలుగు భాష ఉన్న‌తి కోసం ఏం చేస్తే బాగుంటుంద‌న్న విష‌యం మీద ఒక క‌మిటీ కూర్చుంటుంద‌ని.. వారం.. ప‌ది రోజుల్లో చ‌ర్చ‌లు జ‌రిపి..కొన్ని నిర్ణ‌యాలు తీసుకొని మ‌ళ్లీ ఓ స‌భ పెట్టుకుందామ‌ని ప్ర‌క‌టించారు. తెలుగు మ‌హాస‌భ‌లు ముగిసి ఎన్ని వారాలు గ‌డిచిపోయాయో తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించింది లేదు. నిజానికి ఆయ‌న చెప్పిన మాట‌లు గుర్తు లేవు. గుర్తు చేయాల్సిన మీడియా సైతం వ్యూహాత్మ‌క మౌనాన్ని ఆశ్ర‌యించ‌టంతో కేసీఆర్ మాట‌లు ఎలా ఉంటాయ‌న్న‌ది సామాన్యుల‌కు అర్థం చేసుకోలేని ప‌రిస్థితితుల్లో ఉండిపోవ‌టం క‌నిపించింది.

విష‌యం ఏదైనా తాను కోరుకున్న‌ట్లుగా త‌న చుట్టూ ఉన్న వారిని మార్చ‌టం.. వారిని ప్ర‌భావితం చేయ‌టం.. మంత్ర‌ముగ్ధుల్ని చేయ‌టం కేసీఆర్ కు వెన్న‌తో పెట్టిన విద్య‌. తాజాగా జాతీయ రాజ‌కీయాల మీద దృష్టి పెడ‌తాన‌న్న ప్ర‌క‌ట‌న‌తో పాటు.. అందుకుత‌గిన కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లుగా కేసీఆర్ చెబుతున్నారు.

జాతీయ‌స్థాయిలో బీజేపీ.. కాంగ్రేసేత‌ర ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లుగా చేయ‌టంలో కేసీఆర్ స‌క్సెస అయ్యారు.

అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు.. తెలంగాణ స‌ర్కారు వైఫ‌ల్యాల్ని ఎండ‌గ‌డుతూ ఉత్త‌మ్ చేస్తున్న బ‌స్సుయాత్రకు ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌కుండా చేయ‌టంతో పాటు.. తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల్ని వ‌దిలేసి.. అంద‌రూ కేసీఆర్ ఏం చేస్తారు? ఎలాంటి మేజిక్ చేయ‌నున్నారు?  కొమ్ములు తిరిగి మోడీ లాంటోడితో ఢీ అంటే ఢీ అనేంత ఖ‌లేజాను ప్ర‌ద‌ర్శించిన కేసీఆర్ తెగువ ఇప్పుడాన్ను స‌రికొత్త హీరోగా మార్చింది.

త‌న‌కొచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ.. ఇప్పుడు సాగుతున్న జోరును కంటిన్యూ అయ్యేలా సీఎం కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మూడోరోజు ఆయ‌న ముచ్చ‌ట‌గా కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా మీడియాకు స‌మాచారం చేర‌వేశారు.  ప్రంట్ ఏర్పాటుకు జాతీయ‌స్థాయి నేత‌లు.. ప‌లు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌తో మంత‌నాలు జ‌ర‌ప‌టం.. ప‌లువురు రిటైర్డ్ అధికారులు.. వివిధ సంస్థ‌లు.. ప్ర‌ముఖుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం.. ఫ్రంట్‌కు అవ‌స‌ర‌మైన దిశానిర్దేశాన్ని రూపొందించ‌టం లాంటి అంశాల‌తో కేసీఆర్ బిజీగా ఉంటున్నారు.

త‌న నేతృత్వంలో తెర మీద‌కు వ‌చ్చే ఫ్రంట్ విధివిధానాలు ఎలా ఉండాల‌న్న విష‌యాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు జోరుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మార్చి నెలాఖ‌రు నాటికి ఈ విష‌యాల‌పై క్లారిటీ తేవ‌టంతో పాటు.. ఏప్రిల్ నుంచి దేశ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. వీట‌న్నింటి కంటే ముందు.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో త‌న‌తో క‌లిసి వ‌చ్చే రాజ‌కీయ ప‌క్షాల‌తో భారీ భేటీని నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌లో ఆయ‌న త‌ల‌మున‌క‌లై ఉన్నారు. మోడీ మీద త‌న వార్ ఏదో మాట‌ వ‌ర‌స‌కు కాదు.. య‌మా సీరియ‌స్ అనే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News