కేసీఆర్ ఆదేశాల‌తో హైద‌రాబాద్ అష్ట‌దిగ్బంధనం

Update: 2020-04-14 11:50 GMT
తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా కేసులు ప‌దుల సంఖ్య‌లో పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు త‌గ్గింద‌ని భావించ‌గా ప్ర‌స్తుతం కేసులు పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతోంది. ప‌టిష్టంగా లాక్‌ డౌన్ అమ‌లు చేస్తున్నా ఇంకా పెర‌గ‌డంపై ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మ‌హానగరంలో కరోనా వైరస్ కేసులు అత్య‌ధికంగా 270కి పైగా ఉండ‌డం.. లాక్‌ డౌన్ ప‌టిష్టంగా అమ‌లుకాక‌పోవ‌డంపై సంబంధిత అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. దీంతో క‌రోనా వైర‌స్ సోకిన హైద‌రాబాద్‌ లోని ప‌లు ప్రాంతాలను రెడ్ జోన్‌ గా గుర్తించి అక్క‌డ అష్ట‌దిగ్బంధ‌నం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు హాట్ స్పాట్లలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపై వివ‌రాలు ఆరా తీశారు. మ‌రింత‌ పకడ్బందీగా లాక్‌ డౌన్ అమ‌లు చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ముఖ్య‌మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో అధికారులు - పోలీసులు అప్రమత్తమై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఈ సంద‌ర్భంగా పాత‌బ‌స్తీతో పాటు హైద‌రాబాద్‌ లోని ప‌లు ప్రాంతాల‌ను కంటైన్‌ మెంట్ జోన్స్‌ గా గుర్తించారు. సైబరాబాద్‌ లో 39 కంటైన్‌ మెంట్‌ జోన్స్‌ గుర్తించి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ జోన్స్‌ ల‌లో రాక పోకలను పూర్తిగా నిషేధించి - పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌ - మాదాపూర్‌ - శంషాబాద్‌ - అల్వాల్ - అస్మక్‌ పేట్ - జీడిమెట్ల అపూర్వకాలనీ - ధర్మారెడ్డికాలనీ - తుర్కపల్లి - కళావతినగర్‌ - గచ్చిబౌలి - అయ్యప్ప సొసైటీ - ఇజ్జత్‌ నగర్‌ - హఫీజ్‌ పేట్‌ - పాత‌బ‌స్తీలోని చాలా ప్రాంతాల‌ను కంటైన్‌ మెంట్‌ జోన్లుగా గుర్తించారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఒక్క హైదరాబాద్ న‌గ‌రంలోనే 270 కేసులు ఉన్నాయి. ప్రతి సర్కిల్ లో ఒక్కో హాట్ స్పాట్‌ని గుర్తించారు. ఒక్క పాజిటివ్ కేసు ఉన్న ప్రాంతాన్ని క్లస్టర్‌ గా ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో దిగ్బంధం విధిస్తున్నారు. దీంతో హైద‌రాబాద్ కంటైన్ మెంట్ జోన్ల సంఖ్య 15 నుంచి 123కి చేరాయి. కేసీఆర్ ఆదేశాల‌తో 126కి పెంచారు. ఒక్కో కంటైన్ మెంట్ క్లస్టర్‌ కు జోనల్ ఆఫీసర్ - పోలీస్ అధికారి - నోడేల్ ఆఫీసర్లను ప్రభుత్వం కేటాయించింది. కేసీఆర్ ఆదేశాల‌క‌నుగుణంగా అధికార యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటోంది.

హాట్ స్పాట్‌ గా ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో నలుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం పర్యవేక్షణ చేస్తోంది. కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ గా తేలి.. డిశ్చార్జ్ చేసిన వారికి కూడా మరోసారి పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలో మంగళవారం (ఏప్రిల్ 14న) అన్ని జోన్లలో కలిపి 190 మంది న‌మూనాలు సేకరించార‌ని స‌మాచారం. ఈ విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రాన్ని అష్ట‌దిగ్బంధనం చేశారు. ఇక‌పై కేసులు పెర‌గ‌డానికి వీల్లేద‌ని.. క‌రోనా నివార‌ణ కావాల‌ని - లాక్‌ డౌన్ ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని హైద‌రాబాద్ న‌గ‌ర అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News