కేసీఆర్‌ తర్వాతి షాక్‌ కాంగ్రెస్‌ పార్టీకేనా..?

Update: 2015-06-30 06:12 GMT
ఓటుకు నోటు ఉదంతం తర్వాత.. విపక్షాలకు చెందిన ముఖ్యనేతలపై వల విసిరే కార్యక్రమాన్ని తాత్కలికంగా బంద్‌ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మళ్లీ షురూ చేశారా? అంటే అవుననే చెబుతున్నారు. తెలంగాణలో తనను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేసిన తెలుగుదేశం పార్టీ నేతల్ని భారీగా పార్టీలోకి చేర్చుకొని.. పదవులు ఇవ్వటం ద్వారా కోలుకోలేనంత దెబ్బ తీయటం తెలిసిందే.

తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్ను కాంగ్రెస్‌ మీద పడిందని చెబుతున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఒక కీలక నేతను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సదరు నేత మాజీ మంత్రిగా పని చేశారని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాను దెబ్బలు కూడా తినాల్సి వచ్చిందని చెప్పుకునే సదరు కాంగ్రెస్‌ నేత.. చేతిని వదిలేసి.. కారులో ఎక్కేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు.

వాస్తవానికి పార్టీలోకి ఆయన రాకను జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే ఒకరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. అధినేత మనసు దోచుకున్న తర్వాత.. ఎవరు ఎన్ని చెప్పినా వచ్చే వారు రాకుండా మానరు కదా. తన వ్యూహ చతురతతో ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులిచ్చిన సీఎం.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సిద్ధం అవుతున్నారని చెబుతున్నారు. మరి.. దీనికి కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో..?


Tags:    

Similar News