పార్ల‌మెంటులో హాట్ టాపిక్ గా కేసీఆర్!

Update: 2018-03-06 04:31 GMT
నాలుగేళ్లుగా ల‌భించ‌ని ప్ర‌త్యేక గుర్తింపు గులాబీ నేత‌ల‌కు ఇప్పుడు ఢిల్లీలో ల‌భిస్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ మందిలో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రించిన వారిని.. ఇప్పుడు ఆస‌క్తిగా చూడ‌ట‌మే కాదు వారితో మాట‌లు క‌లుపుతున్నారు. కొత్త‌గా వ‌చ్చిన ఇమేజ్ తో గులాబీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మొద‌లు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఇత‌ర పార్టీ నేత‌లు స‌హా ప‌లువురు గులాబీ నేత‌లతో మాట‌లు క‌లిపేందుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌టం క‌నిపించింది.

గ‌డిచిన రెండు.. మూడు రోజులుగా జాతీయ రాజ‌కీయాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఢిల్లీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. కేసీఆర్ ఆలోచ‌న‌ల్ని తెలుసుకోవ‌టానికి ఉత్సుక‌త వ్య‌క్త‌మైంది. అస‌లేం జ‌రుగుతోంది?  కేసీఆర్ ఆలోచ‌నలు ఏంటి? ఆయ‌న కార్యాచ‌ర‌ణ ఏంటి?  కూట‌మిపై సానుకూలంగా ఉన్న వారు ఎవ‌రు?  రానున్న రోజుల్లో కేసీఆర్ ఏం చేయాల‌నుకుంటున్నారు? అన్న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర ప‌లువురి నుంచి వ్య‌క్త‌మైంది.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ను క‌ల‌వ‌టానికి వెళ్లిన ఏపీ కాంగ్రెస్ నేత జేడీ శీలంతో ఆయ‌న కేసీఆర్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. ఆ విష‌యాన్ని జేడీ శీల‌మే స్వ‌యంగా వెల్ల‌డించారు. కేసీఆర్ తో మ‌మ‌తా మాట్లాడార‌ట క‌దా?  ఎవ‌రెవ‌రు చేతులు క‌లుపుతున్నారు? అంటూ ఆరాగా ప్ర‌శ్న‌లు అడిగిన‌ట్లుగా శీలం వెల్ల‌డించారు. గులాబీ నేత‌ల‌తో పాటు.. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉన్న నేత‌లు.. సీనియ‌ర్ మీడియా ప్ర‌తినిధుల‌తోనూ ప‌లువురు జాతీయ పార్టీ నేత‌లు మాట్లాడుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఇదంతా ఒక ఎత్తు కాగా.. పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్లోనూ.. లాబీల్లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారారు టీఆర్ ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత జితేంద‌ర్ రెడ్డి. ఆయ‌న‌తో మాట్లాడ‌టానికి ప‌లువురు నేత‌లు ప్ర‌త్యేక ఆస‌క్తిని క‌న‌బ‌ర్చారు. ఆర్థ‌క మంత్రి జైట్లీ.. ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి అనంత్ కుమార్‌.. బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ లు జితేంద‌ర్ రెడ్డిని ప‌క్క‌కు తీసుకెళ్లి మ‌రీ మాట్లాడ‌టం క‌నిపించింది. కూట‌మి ఏర్పాట్లు ఎప్ప‌టి నుంచి స్టార్ట్ అవుతాయ‌ని ఆరా తీసిన‌ట్లుగా తెలుస్తోంది.

వీరే కాక తృణ‌మూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ‌.. స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన మూలాయంసింగ్‌.. ఆయ‌న త‌మ్ముని కుమారుడు..బీజేపనేత‌లు జితేంద‌ర్ రెడ్డి క‌నిపించిన వెంట‌నే కంగ్రాట్స్ చెప్ప‌టంతో పాటు.. ఫ్యూచ‌ర్ ప్లాన్స్ గురించి మాట్లాడిన‌ట్లుగా స‌మాచారం.  మొత్తంగా ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో కేసీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల్ని విశ్లేషించేందుకు ప్ర‌త్యేక ఆస‌క్తి వ్య‌క్తం కావ‌టం.. బీజేపీ అగ్ర‌నాయ‌కత్వం అలెర్ట్ కావ‌టం చూస్తే.. కేసీఆర్ ప్రాధాన్య‌త రానున్న రోజుల్లో కీల‌కం కానుంద‌న్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News