త‌మ్ముళ్ల నోట కేసీఆర్.. ఇబ్బంది ప‌డుతున్న బాబు!

Update: 2018-03-07 04:30 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌రిస్థితి మ‌హా ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు. త‌న బ‌లం ఏమిటో బాబుకు బాగా తెలుసు. సొంత రాష్ట్రంలోనే బ‌లం అంతంత‌మాత్రంగా ఉన్న ప‌రిస్థితి. మోడీ లాంటోడ్ని ఏ మాత్రం మేనేజ్ చేయ‌లేక‌పోవ‌టం.. విభ‌జ‌న విష‌యంలో బాబు ఫెయిల్యూర్.. ఏపీ అభివృద్ధిలో బాబు త‌ప్ప‌ట‌డుగులు జాతీయ స్థాయిలో బాబు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. ఆ విష‌యాల‌న్నీ బాబుకు తెలియంది కాదు.

గ‌తంలో బాబు స‌క్సెస్ మాత్ర‌మే క‌నిపించి.. ఫెయిల్యూర్స్ క‌నిపించ‌క‌పోవ‌టంతో బాబు మ‌హా తోపు అన్న భావ‌న ఉండేది. దీనికి తోడు.. ఆయ‌నకు భ‌జ‌న చేసే మీడియా పుణ్య‌మా అని బాబు మ‌హాశ‌క్తివంతుడ‌న్న ఫీలింగ్ ఉండేది. కానీ.. మారిన కాలంలో విష‌యాల‌న్నీ బ‌య‌ట‌కు రావ‌టంతో ఎవ‌రేంటో తెలిసిపోతున్న ప‌రిస్థితి. అన్నింటికి మించి ఓటుకు నోటు ఎపిసోడ్ లో బాబుకు భారీగా దెబ్బ ప‌డిన‌ట్లు చెబుతారు. కేసీఆర్ గేమ్స్ ముందు బాబు తేలిపోయిన వైనాన్ని సొంత పార్టీ నేత‌లు సైతం త‌మ అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో త‌ర‌చూ చ‌ర్చించుకుంటార‌ని చెబుతారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌నిస‌రి అంటూ ఇప్పుడు కొత్త‌పాట అందుకున్న చంద్ర‌బాబు.. అదే అంశం మీద పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రాకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలాంటి వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనూహ్యంగా థ‌ర్డ్ ఫ్రంట్ గురించి ప్ర‌స్తావించి క‌ల‌క‌లం రేపారు.

ఏం చేసినా త‌మ నాయ‌కుడు మాత్ర‌మే చేయాల‌ని త‌పించే తెలుగు త‌మ్ముళ్ల‌కు.. గ‌డిచిన మూడు.. నాలుగు రోజులుగా కేసీఆర్ స్టేట్ మెంట్లు ఇబ్బందిగా మారిన‌ట్లు చెబుతున్నారు. కేసీఆర్ మాదిరి త‌మ అధినేత కూడా కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌న్న భావ‌న త‌మ్ముళ్ల‌లో పెరుగుతోంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌న‌కు అంత ఇమేజ్ లేద‌న్న విష‌యం బాబుకు తెలుసు. నాలుగేళ్లు గ‌డుస్తున్నా ఏపీని ఒక కొలిక్కి తీసుకురావ‌టంలో పెయిల్యూర్ బాబును వెంటాడుతోంది. ఇలాంటి వేళ‌.. కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ మాదిరే.. బాబు కూడా జాతీయ రాజ‌కీయాల వైపు దృష్టి పెట్టాల‌న్న కోరిక‌ను చంద్ర‌బాబు ఎదుట పెట్టారు కొంద‌రు త‌మ్ముళ్లు.

పార్టీ అంత‌ర్గ‌త స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌స్తావ‌న బాహాటంగా రావ‌టంతో బాబు తెగ ఇబ్బంది ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మీరు కూడా కూడ‌గ‌డితే స‌త్తా తెలుస్తుంద‌ని.. ఒక రాష్ట్రానికే ప‌రిమితం కావ‌టంతో కేంద్రం త‌క్కువ‌గా అంచ‌నా వేస్తుందంటూ ఒక‌రిద్ద‌రు నేత‌లు ఆవేశంగా మాట్లాడిన‌ట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వారికి ఉన్న వాస్త‌వ ప‌రిస్థితిని బాబు చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో.. తీవ్ర అసౌక‌ర్యానికి గురైన‌ట్లుగా చెబుతున్నారు.

జాతీయ రాజ‌కీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలంటూ త‌మ్ముళ్లు తీసుకొచ్చిన ప్ర‌స్తావ‌న‌పై స్పందించిన చంద్ర‌బాబు.. త‌న‌కు అలాంటి ఆస‌క్తి లేద‌ని.. గ‌తంలోనే అలాంటివి చేసేశాన‌ని.. జాతీయ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకుంటే ఢిల్లీకి.. అమ‌రావ‌తికి తిర‌గాల్సి ఉంటుంద‌న్నారు. ఏపీని అభివృద్ధి చేయ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా చెప్పిన ఆయ‌న తెలివిగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. ఏమైనా.. కేసీఆర్ ప్ర‌స్తావ‌న బాబుకు చిరాకుగా మారుతుంద‌న్న మాట ఆయ‌న స‌న్నిహితులు కొంద‌రు చెప్ప‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News