విలీన వీరుల‌కు కేసీఆర్ తోఫా!

Update: 2019-06-07 07:43 GMT
దెబ్బ నొప్పి తెలిసిన వాడు దెబ్బేస్తే అదెంత దారుణంగా ఉంటుందో తెలంగాణ‌లో తాజా రాజ‌కీయ ప‌రిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ ఎస్ పార్టీ పెట్టిన కేసీఆర్‌.. త‌న రాజ‌కీయ ప్ర‌యాణంలో ఎన్ని ఎదురుదెబ్బ‌లు తిన్నారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

స్వార్థ పూరిత రాజకీయంతో త‌మ‌ను దెబ్బ తీస్తున్నార‌ని ఆయ‌న త‌ర‌చూ వాపోయేవారు. అలాంటి కేసీఆర్.. ఈ రోజు నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ ను ఖ‌తం చేసేందుకు అనుస‌రించిన విలీన వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో న్యాయం ఎంత‌?  ధ‌ర్మం ఎంత‌?  విలీన నిర్ణ‌యం కేసీఆర్ లాంటి నేత చేయాల్సిందేనా? అన్న చ‌ర్చ ఓప‌క్క జోరుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌రిగిన విలీనంతో కేసీఆర్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఒక‌ప్పుడు త‌న‌ను ఒక ఆట ఆడించిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా త‌న దెబ్బ‌తో విల‌విల‌లాడిపోవ‌ట‌మే కాదు.. ఉనికి కోసం కిందా మీదా ప‌డాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. విలీన వీరుల‌కు కేసీఆర్ ఏమిచ్చి బ‌దులు తీర్చుకోనున్నారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ప్ర‌స్తుతం కేసీఆర్ కేబినెట్ లో ప‌ద‌కొండు మంది స‌భ్యులు ఉన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం చూస్తే.. మ‌రో ఐదుగురికి కేబినెట్ లోచోటు ద‌క్కే వీలుంది. మ‌రి.. ఈ ఐదు ప‌ద‌వులు ఎవ‌రికి ఇస్తారు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఈసారి విలీన వీరుల‌కు పెద్ద పీట వేసే అవ‌కాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ ను ఖ‌తం చేయాల‌న్న త‌న క‌ల‌ను తీర్చిన విలీన వీరుల‌కు పెద్ద పీట వేస్తూ.. వారిని కేబినెట్ లో చేర్చుకునే వీలున్న‌ట్లుగా చెబుత‌న్నారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన ప‌న్నెండు మందిలో క‌నీసం ఇద్ద‌రు నుంచి ముగ్గురు వ‌ర‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని చెబుతున్నారు. మ‌రి.. ఆ అదృష్ట‌వంతులు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.


Tags:    

Similar News