కేసీఆర్ తమిళనాడు టూర్ లో ఆసుపత్రికి వెళ్లారెందుకు?

Update: 2021-12-15 03:44 GMT
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి.. ఆ రాష్ట్ర గవర్నర్ కు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే.. రెండు రైలు పట్టాల మాదిరి ఉంటుంది. పక్కపక్కనే ఉన్నప్పటికి.. ఎవరిది వారిదే అన్నట్లు ఉంటుంది. అలాంటి తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన గవర్నర్ గా నరసింహన్ ను చెప్పాలి. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా వచ్చిన ఆయన.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలక భూమికను పోషించటమే కాదు.. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.

దేశంలోని ఏ ముఖ్యమంత్రి.. గవర్నర్ మధ్య లేనంత దగ్గరితనం వారిద్దరి మధ్య ఉందని చెబుతారు. నిజానికి ఏ సీఎం కూడా.. రాష్ట్ర గవర్నర్ ను అన్నిసార్లు.. అంతంతసేపు భేటీ కావటం కనిపించదు. చాలా సందర్భాల్లో వారి భేటీ ఐదారు గంటలకు పైనే సాగటం తెలిసిందే. ఒకవిధంగా చెప్పాలంటే.. గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్.. కేసీఆర్ కు సో స్పెషల్ అని చెబుతారు.వారిద్దరి మధ్య ఉన్న స్నేహం ఎంతన్న విషయం.. ఆయనకు వీడ్కోలు పలికే వేళలోనూ స్పష్టంగా కనిపించింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. మాజీ గవర్నర్ నరసింహన్ ను కలుస్తారన్న అంచనాకు తగ్గట్లే జరిగింది. కాకుంటే.. నరసింహన్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో.. ఆయన్ను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. ఆయన్నునేరుగా కలవకుండా.. ఆసుపత్రిలోనే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ను తెలుసుకొన్నారు.

సాధారణంగా ఐసీయూలో ఉన్న పేషెంట్ ను కొన్ని క్షణాలైనా కలిసే వీలుంటుంది. అందులోకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు.. అందుకుతగ్గ ఏర్పాట్లు చేస్తారు. కానీ.. ఆసుపత్రికి వెళ్లి.. ఐసీయూకు వెళ్లకుండానే కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి వచ్చేయటం చూస్తే.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదన్న మాట వినిపిస్తోంది. నరసింహన్ అన్నంతనే బలంగా ఉంటూ.. నిత్యం ఉత్సాహంగా ఉండే ఆయన.. ఈ రోజున ఐసీయూలో ఉన్నారంటే.. ఎంతటి వాడైనా ఒక దశ దాటిన తర్వాత కొన్ని తప్పవన్న భావన కలుగక మానదు. ఏమైనా.. నరసింహన్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.
Tags:    

Similar News