చచ్చిన కాంగ్రెస్‌ ను ఎలా బతికిస్తావ్ రాహుల్?

Update: 2017-06-04 08:17 GMT
త‌మ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా - ఇత‌ర పార్టీల నేత‌ల సంఘీభావాన్ని తీసుకొని ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం బహిరంగ స‌భ‌ నిర్వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీపై అధికార తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరిగింది. ఏకంగా మంత్రులు రంగంలోకి దిగి దుమ్మెత్తిపోశారు. శాప‌నార్థాలు పెట్టారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ రాహుల్ గాంధీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని అన్నారు. కట్టు గుడ్డలతో బయటకి పంపించిన నాయ‌కులు ఈ రోజు ఎలా ఉన్నారో  చూడడానికి వస్తున్నారా అని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా అంటూ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ  - రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఈ విషయాన్ని ఎప్పుడైనా ప్రస్తావించారా అని కేఈ నిల‌దీశారు. రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన కేవలం  రాజకీయ ప్రయోజనం కోసమేన‌ని ఆరోపించారు.

అధికారం కోసం కుమ్మక్కు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని కేఈ ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభను బహిష్కరించాలని కేఈ కోరారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన గాయాలను మాన్పగల సమర్థ‌త టీడీపీ అధినేత‌ చంద్రబాబు దగ్గర ఉందనే ఉద్దేశంతోనే ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని కేఈ విశ్లేషించారు.

మ‌రో స‌మావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ర్ట విభజన హేతుబద్ధంగా జరగలేదని అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్యాయంగా విభజించి ఈరోజు సిగ్గులేకుండా రాష్ట్రంలోకి వచ్చి రాహుల్ గాంధీ స‌భ‌ పెడుతున్నారని విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్టంలో చచ్చి పోయిందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ``చ‌చ్చిపోయిన వ్యక్తిని ఎవరైనా బతికిస్తారా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కూడా అంతే`` అని ఎద్దేవా చేశారు. విభజన అనంతరం ఏపీకి 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా.. గత మూడేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ, ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా శ్రమిస్తున్నారని కొనియాడారు. లోటు బడ్జెట్ లో ఉన్నా 24 వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘ‌న‌త‌ టీడీపీ ప్ర‌భుత్వానిద‌ని మంత్రులు కొనియాడారు. ఒక మహాయజ్ఞంలాగా పోలవరం ప్రాజెక్టు చేపడుతున్నార‌ని వివ‌రించారు. 2019 నాటికి పొలవరం ప్రాజెక్టు పూర్తీ చేసి రాష్ట్రంలో కరువులు లేకుండా చేయడమే త‌మ ప్రభుత్వ లక్ష్యమ‌ని టీడీపీ మంత్రులు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News