కేఈ బ్ర‌ద‌ర్స్‌ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న వెనుక మ‌ర్మం ఏంటి?

Update: 2017-06-30 10:31 GMT
ఏపీ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ కేఈ ప్రభాకర్ సన్మాన కార్యక్రమం క‌ర్నూలులో అట్ట‌హాసంగా జరిగింది. ముఖ్యఅతిథిగా కేఈ ప్ర‌భాక‌ర్ సోద‌రుడైన ఉప‌ముఖ్య‌మంత్రి - కేఈ కృష్ణ‌మూర్తి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో నేత‌లు హాజ‌రై కేఈ ప్ర‌భాక‌ర్‌ ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు. చూస్తుంటే...ఇది సాదార‌ణ స‌న్మాన కార్య‌క్ర‌మం లాగానే ఉన్న‌ప్ప‌టికీ కేఈ బ్ర‌ద‌ర్స్ త‌మ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదికగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఉప‌యోగించుకున్నార‌ని క‌ర్నూలు రాజ‌కీయ‌ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ త‌ర‌ఫున టికెట్ ఆశించిన భంగ‌ప‌డిన కేఈ ప్ర‌భాక‌ర్ ఆ స‌మ‌యంలో నిర‌స‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా పార్టీ కార్యాల‌యం వ‌ద్ద‌కే త‌న శ్రేణులతో ర్యాలీ నిర్వ‌హించారు. పార్టీ అధినేత చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. దీనిపై ఫైర్ అయిన‌ బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌ చ‌ర్య‌లకు ఆదేశించారు. ఆ త‌ర్వాత ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌నుకోండి అది వేరే విష‌యం. ఇదిలాఉండ‌గా...రాబోయే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేఈ ప్ర‌భాక‌ర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకోసం త‌న అభ్య‌ర్థిత్వాన్ని పార్టీ గుర్తించేందుకే ఈ స్థాయిలో భారీ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్తున్నారు. పార్టీ అధిష్టానం క‌ర్నూల్‌ లో త‌మ స‌త్తాను గుర్తించాల‌నే కేఈ సోద‌రులు ఇలా ప‌రోక్షంగా బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సన్మాన కార్యక్రమం సంద‌ర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి సైతం ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. తాము మొదటి నుంచి ప్రజల‌ సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం కేటాయించటం వల్ల ప్రజలు త‌మ వైపే ఉన్నారని వెల్లడించారు. అయితే గడిచిన ఎన్నికల్లో పార్టీ కేవలం 3 స్థానాలకే పరిమితమైందని స్వయంగా అధినేత చంద్రబాబే పలుమార్లు అన్నారని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుని చంద్రబాబుకు గిఫ్ట్‌ గా ఇస్తామని స్పష్టం చేశారు. మనది తెలుగు సేన ఈ సేన ముందు ఎవరైనా చిత్తయిపోవాల్సిందే అన్నారు. సీఎం చంద్రబాబు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఇస్తే జిల్లాలో పార్టీకి తిరుగే ఉండదన్నారు. కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తనపై అభిమానంతో కీల‌క‌ పదవి ఇచ్చారని అందుకే సంతోషంగా బాధ్యతలు చేపట్టానన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పార్టీలో ఉందని, మాపై నమ్మకం ఉంచి పదవులు కట్టబెట్టితే అందుకు ప్రతిఫలంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగుర వేయటానికి కృషి చేస్తామన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News