కోదండ‌రాం మాట - బాబు ప్ర‌చార‌మే ముంచింది

Update: 2018-12-19 08:49 GMT
తెలంగాణ‌లో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు బాగా ఆశ‌లు పెట్టుకున్నారు. మంచి ఫ‌లితాలు సాధించి టీడీపీకి ఇక్క‌డ పున‌ర్ వైభ‌వం తీసుకురావాల‌ని క‌లలుగ‌న్నారు. హైద‌రాబాద్ పై - ఆ మాట‌కొస్తే మొత్తం తెలంగాణ‌పై తిరిగి ప‌ట్టు సాధించేందుకు ఇదే మంచి అవ‌కాశ‌మ‌ని భావించారు. అందులో భాగంగానే త‌మ బ‌ద్ధ శ‌త్రువు కాంగ్రెస్ తో జ‌ట్టు క‌ట్టారు.

కానీ - చంద్ర‌బాబు క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి. ఆశ‌ల‌న్నీ అడియాస‌లుగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్‌-టీడీపీ కూట‌మి దారుణ ప‌రాజ‌యం చ‌విచూసింది. చంద్ర‌బాబు వ్య‌థ‌ అక్క‌డితో ఆగ‌లేదు. ప‌రాజ‌యానికి దారితీసిన ప‌రిస్థితుల‌పై అంత‌ర్మ‌థ‌నం ప్రారంభించిన టీ-కాంగ్రెస్ నేత‌లు టీడీపీ అధినేత వైపే వేలెత్తి చూపించ‌డం ప్రారంభించారు. ఆయ‌న‌తో పొత్తే త‌మ‌ ఓట‌మికి కార‌ణ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో చంద్ర‌బాబు ప్ర‌భావంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ప‌లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. రాష్ట్రంలో బాబు ప్ర‌స్థానం ముగిసిన శ‌క‌మ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఆయ‌న్ను ఆద‌రించే స్థితిలో ఏమాత్రం లేర‌ని సూచిస్తున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌నే ఇందుకు నిద‌ర్శ‌నంగా పేర్కొంటున్నారు.

ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించ‌కుండా చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ప్ర‌య‌త్నించిన విల‌న్ గా చంద్ర‌బాబును ఇక్క‌డి ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని టీ-కాంగ్రెస్ నేత ఒక‌రు తెలిపారు. అలాంటి వ్య‌క్తి తెలంగాణ‌లో హాయిగా తిరుగుతూ ప్ర‌చారం చేయ‌డాన్ని - ఆయ‌న‌తో కాంగ్రెస్ పొత్త‌ను జ‌నం జీర్ణించుకోలేక‌పోయార‌ని వెల్ల‌డించారు. తెలంగాణ‌లో తిరిగి ఆంధ్రుల వ‌ల‌స పాల‌న‌ను తీసుకొచ్చేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ చేసిన ప్ర‌చారం కూడా ప్ర‌జ‌ల‌పై గ‌ట్టి ప్ర‌భావం చూపింద‌ని అన్నారు.

ప్ర‌జా కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్ష‌మైన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధినేత కోదండరాం కూడా ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. త‌మ కూట‌మి ప‌రాజ‌యానికి చంద్ర‌బాబు విస్తృత ప్ర‌చార‌మే ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌ని విశ్లేషించారు. కేసీఆర్ కు చంద్ర‌బాబుకు మ‌ధ్య జ‌రుగుతున్న పోటీగా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌జ‌లు భావించార‌ని పేర్కొన్నారు.  బాబుతో పొత్తు కార‌ణంగా టీడీపీ ఓటుబ్యాంకు మొత్తం కాంగ్రెస్ కు మ‌ళ్లుతుంద‌ని తాము భావించామ‌ని.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని మ‌రో కాంగ్రెస్ నేత విశ్లేషించారు. బాబు ప్ర‌చారం వ‌ల్ల సెటిల‌ర్లు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిస్తార‌ని అనుకున్నామ‌ని తెలిపారు. ఆ వ్యూహం బెడిసి కొట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News