కేసీఆర్ కు మంట పుట్టేలా మాట్లాడిన కోదండరాం

Update: 2018-04-30 07:27 GMT
ఫుల్ గా లోడ్ చేసిన తుపాకీని గురి పెట్టి ఫైరింగ్ షురూ చేస్తే ఎలా ఉంటుందో.. తాజాగా తెలంగాణ జ‌న‌స‌మితి అధ్య‌క్షుడిగా ఎన్నికైన సంద‌ర్భంగా కోదండ‌రాం చేసిన ప్ర‌సంగం అదే మాదిరి ఉంది.  తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిని.. ఆయ‌న పాల‌నా విధానాల్ని సునిశితంగా త‌ప్పు ప‌ట్టిన కోదండం మాష్టారు.. తీవ్ర విమ‌ర్శ‌లు.. అంత‌కు మించిన సురుకు ఆరోప‌ణ‌ల్ని చేశారు.

తాను మాయ‌మాటలు చెప్ప‌న‌ని.. అవి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌వ‌ని.. తాను తెలంగాణలో కొత్త రాజ‌కీయాల్ని షురూ చేస్తాన‌న్నారు. త‌న ద‌గ్గ‌ర పైస‌ల్లేవ‌న్న ఆయ‌న‌.. కేసీఆర్ ను గ‌ద్దె దించ‌టం కోస‌మే తాను పార్టీ పెట్టిన‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణ‌లో అధికారాన్ని దుర్వినియోగం చేసే వారిని నిల‌దీద్దామ‌ని.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి.. పెత్త‌నం చేస్తున్న కేసీఆర్ నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా తాను పోరాడ‌తాన‌ని స్ప‌ష్టం చేశారు.

కోదండం మాష్టారి స్పీచ్ లో ఆస‌క్తిక‌ర అంశాలు.. కీల‌క వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+  ప్రజలు సంఘటితంగా పోరాడితేనే తెలంగాణ వచ్చింది. రైల్‌రోకో అంటే పట్టాలపై కూర్చున్నాం. వంటావార్పు అంటే రోడ్లపైకి వచ్చాం. సకలజనుల సమ్మె అంటే గుడి, బడి.. బంద్‌. చివరకు సీఎం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని పార్లమెంటులో సుష్మాస్వరాజ్‌ అప్పట్లో చెప్పారు. అమరుల కుటుంబాలను చూస్తుంటే దుఖం వస్తుంది. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి యాదయ్య అగ్నిగోళంలా బయటకొచ్చారు. వరంగల్‌లో భరద్వాజ అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన స్వర్ణ అగ్నికి ఆహుతై ఆసుపత్రిలో చావుబతుకుల్లోనూ జై తెలంగాణ అంటూ నినదించింది. కన్నతల్లిని మరిచిపోయి తెలంగాణ తల్లిని తలుచుకుని పోరాడి జీవితాల్ని త్యాగం చేశారు. నిజామాబాద్‌కు చెందిన యువకుడు జూబ్లీ బస్‌స్టేషన్‌ ముందు ఆత్మాహుతి చేసుకున్నపుడు ఆ తండ్రి రోదన ప్రపంచంలో ఎన్నడూ చూడలేదు.

+ ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలనుకుని 650 మంది ప్రాణత్యాగం చేయలేదు. ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చిన తరువాత ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో పని చేయాలని కోరాం. 2014, 2015లో ఎంతో మంది నన్ను తిట్టారు. ఊరికెళ్తే అడిగారు. పంటలు ఎండిపోయాయన్నారు.

+ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా.. సాధించుకునేందుకు కొంత గడువు పడుతుందన్నా. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడగని విషయమంటూ ఏమీ లేదు. చివరకు న్యాయవాదులు, జర్నలిస్టులకూ ఏమీ చేయలేదు. ఆత్మగౌరవంతో బతికేలా చూడాలని, అడుక్కుతినే పరిస్థితి రావద్దని అడిగాం. కానీ ఆంధ్రా పాలకులు ఏం చేశారో అదే చేస్తున్నారు.

+ నేను మాయమాటలు చెప్పను. అవి మీకు నచ్చవు. ఈ రోజు నుంచి తెలంగాణలో కొత్త రాజకీయాలు. నా దగ్గర పైసల్లేవు. రెండ్రోజుల కూలీ డబ్బుల కోసం ప్రజలు బతుకు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని నిలదీద్దాం.

+ మా ఓట్లతో గెలిచి నీవేంది పెత్తనం చేసేది. దిగిపొమ్మని ఈ వేదికపై చెబుతున్నాం. దించడానికే బయలుదేరాం
తెలంగాణలో నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడతాం. ప్రభుత్వం ప్రజల మీద పరాన్నభుక్కుగా జీవిస్తోంది.  ప్రభుత్వ ప్రజలకు సేవ చేసేదిలా ఉండాలి. పీడించేది కాకూడదు.

+ కాంట్రాక్ట‌ర్ల‌తో.. కార్పొరేట్లతో స్నేహం చేస్తూ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదు. పాలకుల అవినీతి వల్లనే తెలంగాణ వెనుకబడిందన్నారు. తెలంగాణ జనసమితి ద్వారా మరో నవ తెలంగాణను నిర్మించుకుందాం.  టీఆర్ఎస్‌ ప్లీనరీలో దేశంలో ఇంతకన్నా అభివృద్ధి చెందిన రాష్ట్రం లేదని అన్నారు. తెలంగాణ సంపద మూడు జిల్లాల చుట్టూ కేంద్రీకృతమైంది. మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి? ఆ మూడు జిల్లాల్లోనూ అందరూ బాగుపడలేదు. కొందరు పెద్దమనుషులతో కుమ్మక్కై వారికే లాభం చేకూర్చారు.

+ వరంగల్‌, హైదరాబాద్‌ల్లో పేదలు సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 8వేల ఎకరాలను జప్తు చేస్తే అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వవచ్చు. నూటికి 55 శాతం వ్యవసాయం మీద ఆధారపడితే రాష్ట్ర సంపదలో వారికి నూటికి రూ.7 దొరుకుతున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఉంటే మరో ఏడు రూపాయలు లభిస్తున్నాయి. నెలకు రూ.8 వేలు, రూ.10 వేలు సంపాదిస్తే ఎలా బతుకుతారు?

+ తెలంగాణ కోసం కొట్లాడితే రౌడీ అవుతారా? వారిని అణచిన ఎమ్మెల్యేలు, అణచివేసిన వాళ్లు రౌడీలు కావాలి. అప్పట్లో ఉద్యమంలో దెబ్బలుతిని, ఇప్పుడు కేసుల పేరిట మళ్లీ జైలు పాలవుతున్నారు. ఉద్యమంలో పోరాడిన వారెవరూ ఎమ్మెల్యే కావాలని, మంత్రి సీటు దక్కాలని కోరుకోలేదు.

+ ప్రభుత్వం రెండు పెద్ద ప్రాజెక్టులకు ప్రణాళిక వేసింది. అవి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తోంది. గోదావరి నుంచి ఎల్లంపల్లికి 160 టీఎంసీలు ఎక్కణ్నుంచి తీసుకురావాలన్నది చర్చ. తుమ్మడిహట్టిపై ఒక్క కట్ట కడితే చాలు. కానీ ఎల్లంపల్లి కింద మూడు కట్టలు కట్టింది. కిందికట్ట నుంచి నడిమింతల కట్ట... అక్కడి నుంచి పైకట్టకు నీళ్లు ఎత్తిపోస్తారట. అదీ 100 మీటర్ల ఎత్తునుంది. తుమ్మడిహట్టి నుంచి 40 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు పోస్తే సరిపోయేది.

+ రూ.50 వేల కోట్లతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కాంట్రాక్టు విచిత్రమైనది. ఎల్లంపల్లి కట్ట కట్టడంతో పాటు అక్కడే మోటారు కొని బిగించే కాంట్రాక్టు గుత్తేదారుకు ఇచ్చారు. మోటారు లెక్కలు మా ఇంజినీర్లకు తెలియదన్నారు. ఇంకేముంది మోటారుపై కమీషన్‌ దొరుకుతుంది. పైపులు కొనే బాధ్యత అప్పగించి, దానిపైనా కమీషన్లు తీసుకుంటున్నారు. ఇలా అలవాటైతే ఏ ప్రభుత్వమూ ప్రజలకు మేలు చేయదు.

+ నేరెళ్ల ఘటనలో లారీలను కాల్చితే కేసులు పెట్టకుండా పోలీసులతో కొట్టించింది. ఆవిర్భావ సభకూ అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. గజేంద్రుడు మొసలి నోట్లో ఇరుక్కున్నట్లు.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మన ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌ గేటు తెరుచుకోదు. ఆయన సచివాలయానికి రారు. తెలంగాణ తెచ్చుకుంది ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల్లా ఉండటానికి వీల్లేదు.

+ తెలంగాణలో ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అన్నివర్గాలకు న్యాయం జరిగేలా పోరాడతాం. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలి. అంతిమ విజయం మనదే అవుతుంది. తెలంగాణ జనసమితి పోటీచేస్తే ఓట్లు చీలుతాయని కొందరన్నారు. రాజకీయ పరిణామాలు సక్రమంగా ఉంటేనే ఓట్లు ఐక్యంగా ఉంటాయి. సంఘటితంగా, నవ తెలంగాణ నిర్మాణం, సామాజిక న్యాయం ధ్యేయంగా, ప్రజాస్వామ్య విలువల పునాదిగా, ప్రజల బతుకుదెరువు కేంద్రంగా పని చేయాలి. దీనికి అందరూ ఈ వేదికగా సిద్ధం కావాలి.


Tags:    

Similar News