కోల్‌క‌తాలో `మాహిష్మ‌తి` అదిరిందిగా!

Update: 2017-09-27 11:34 GMT
ప్ర‌పంచ సినీ జ‌గ‌త్తుకే పాఠాలు నేర్పిన బాహుబ‌లి సృష్టించ‌ని రికార్డు లేదు. చేర‌ని ప్రాంతం లేదు. మంత్ర ముగ్ధుణ్ని చేయ‌ని ప్రేక్షకుడు లేదు. అలాంటి మూవీలోని మాహిష్మ‌తి రాజ ప్రాసాదం భారీ ఖ‌ర్చుతో నిర్మించారు. సినిమాలో దాదాపు 50% ఇక్క‌డే పూర్తి చేసుకుంది. ఈ సినిమాల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ప్ర‌తి ఫ్రేములోనూ మాహిష్మ‌తి అదిరిపోయింది. అలాంటి సెట్టింగ్‌ ను పోలిన భారీ నిర్మాణం ఇప్పుడు కోల్‌ క‌తాలో ఏర్పాటు చేశారు.

ప్ర‌స్తుతం ద‌స‌రా న‌వ‌రాత్రులు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వినాయ‌క చ‌వితికి ముంబై - హైద‌రాబాద్ ఎలాగో.. ద‌స‌రాకి ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌ క‌తా అలా. అక్క‌డి ప్ర‌తి వీధిలోనూ అమ్మ‌వారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి 9 రోజులు పూజిస్తారు. అదేక్ర‌మంలో దసరా ఫెస్టివల్ సందర్భంగా కోల్‌ కతా సిటీలో మాహిష్మతి సెట్టింగ్స్‌ ని పోలిన బ్రహ్మాండమైన పందిరిని ఏర్పాటు చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే మాహిష్మతి సామ్రాజ్యం మాదిరిగానే చుట్టూ ఏనుగులు, ఎత్తైన కోట గోడలు ఇలా  చాలా సుంద‌రంగా తీర్చి దిద్దారు. దీంతో కోల్‌కతా వాసులు ఈ సెట్టింగును చూసేందుకు తండోప తండాలుగా ఇక్క‌డ‌కు చేరుకుంటున్నారు.

శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఆధ్వర్యాన నిర్మించిన ఈ పాండాల్‌(పందిరి)ను ఇటీవల సీఎం మమతాబెనర్జీ ప్రారంభించారు. దాదాపు పది కోట్ల ఖర్చుతో ఇక్కడ దీనిని డిజైన్ చేశారు. 150 మంది ఆర్టిస్టులు మూడు నెలలపాటు శ్రమించి దీన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక‌, ఇక్క‌డ ఏర్పాటు చేసిన‌ దుర్గాదేవి అలంకరణలకు, బంగారు ఆభరణాలకు  కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.  ఎమ్మెల్యే, పూజల ప్రధాన నిర్వాహకుడైన సుజిత్‌బోస్ ఈ  మాహిష్మతి గురించి వివరిస్తూ కొన్ని లక్షల మంది దీన్ని సందర్శించి ఆనందిస్తున్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఏదేమైనా.. తెలుగు వెలుగులు దేశ వ్యాప్తంగా ప్ర‌స‌రిస్తున్నాయ‌న్న‌మాట‌.
Tags:    

Similar News