అమ్మో...బాబుతో జర జాగ్రత్త !

Update: 2018-09-14 04:02 GMT
ముందస్తు ఎన్నికలకు సర్వం సిద్ధమయిపోతున్నాయి. అధికార - ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు తెర తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల రణరంగంలో దిగేందుకు అన్ని పార్టీలు తమ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహాకూటమి పొత్తు కూడా దాదాపు పూర్తి కావచ్చిందనే వార్తలూ వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో పొత్తులు... సీట్ల సర్దుబాట్లు... అభ్యర్ధుల ఖరారు కూడా పూర్తి అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ జన సమితి - వామపక్షాలను ఒకే ఒక్క సమస్య వెంటాడుతోంది. దీని నుంచి ఎలా బయటపడాలా అన్నదే ఈ పార్టీలను వేధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. ఇంతకీ ఆ సమస్య ఏమిటనుకుంటున్నారా.... ఇంకేం లేదు...తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ‌్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొత్తులకు - ఎత్తులకు - ఎదుటి వారిని చిత్తు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడి రాజకీయాలను మెచ్చుకునే కాంగ్రెస్ - వామపక్షాలు - తెలంగాణ జన సమితి నేతలకు ఆ చంద్రబాబు నాయుడే పెద్ద సమస్యగా మారారని అంటున్నారు. దీనికి కారణం ఎన్నికల వరకూ తమతో సఖ్యంగా ఉండే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కూడా తమతో స్నేహాన్ని కొనసాగిస్తాడా అన్నది ఇప్పుడు ఆ నాయకులను - ఆయా పార్టీల కార్యకర్తలను వేధిస్తున్న పెద్ద ప్రశ్న.

ఇటీవల తెలంగాణ తెలుగుదేశం నాయకులతో జరిపిన చర్చల్లో చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలను కలవరపరుస్తున్నాయంటున్నారు. ఎన్నికల వరకూ తెలుగుదేశం తెలంగాణ నాయకులెవ్వరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని - అన్నీ తానే చూసుకుంటానని చంద్రబాబు నాయుడు వారికి చెప్పారని అంటున్నారు. దీని అర్ధం ఏమిటో తెలుగుదేశం తెలంగాణ నాయకుల‌కే కాదు కాంగ్రెస్ - తెలంగాణ జన సమితి - వామపక్ష నాయకులకు కూడా అర్ధం అయ్యిందని అంటున్నారు. ఎన్నికల వరకూ మిత్రపక్షంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పరిస్ధితులను బట్టి ప్లేటు ఫిరాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నాయకుల భయంగా చెబుతున్నారు. దీనిని ద్రష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీతో పొత్తుపై మరోసారి ఆలోచించాలంటూ అధిష్టానానికి సూచించినట్లు చెబుతున్నారు.

గతంలో చంద్రబాబు నాయుడుతో అనుభవం ఉన్న వామపక్షాలు కూడా ఇదే భయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ జన సమితి నాయకులు - కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని - ఆయనతో ముందు ముందు కష్టమనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో మిత్రపక్షాలను సైతం అమ్మో....బాబు అనిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News