కోటంరెడ్డి వర్సెస్‌ ఆదాల ఎవరిది పైచేయి?

Update: 2023-02-09 14:43 GMT
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలతో కలకలం సష్టించిన సంగతి తెలిసిందే. తనపైన సొంత వైసీపీ ప్రభుత్వమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించిందని గత కొన్ని రోజులుగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎంతో ప్రాణపదంగా ప్రేమించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో తనకు ఇంత అన్యాయం జరుగుతుందని.. తనపైనే ఇంత నిఘా పెడతారని తాను అసలు ఊహించలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని వైసీపీ అధిష్టానం ఇంచార్జి పదవి నుంచి తప్పించింది. ఆ పదవిని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డికి అప్పగించింది. అంతేకాకుండా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి భద్రతను కూడా జగన్‌ ప్రభుత్వం కుదించింది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మరోవైపు  కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని.. ఆడియో రికార్డింగ్‌ అని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ప్రభుత్వంపైన కోటంరెడ్డి బురద జల్లుతున్నారని మంyì పడుతున్నారు. కోటంరెడ్డి తన స్నేహితుడితో మాట్లాడిన పోన్‌ కాల్‌ ను ఆయన స్నేహితుడే రికార్డు చేసి ఆయనకు పంపాడని.. దాన్ని పట్టుకుని కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ అంటున్నారని వైసీపీ నేతలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేనైన తన ఫోన్‌ ను వైసీపీ ప్రభుత్వం ట్యాప్‌ చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ జరిపించాలని విన్నవించారు. తన వ్యక్తిగత గోపత్యకు, ప్రై వసీకి భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై అవసరమైతే తాను ఢిల్లీ వెళ్లి నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలుస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వెల్లడించారు. ట్యాపింగ్‌ జరిగిందని తాను ఆరోపణలు చేస్తుంటే తిరిగి వైసీపీ నేతలు తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మీదని.. మీకున్న అన్ని విచారణ సంస్థలతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని సవాల్‌ విసిరారు. తన విమర్శలకు సమాధానం చెప్పకుండా తనను తిట్టడం, శాపనార్థాలు పెట్టడం పనిగా పెట్టుకున్నారని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడితే తట్టుకోలేక తనను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపణలపై మీడియాతో మాట్లాడారు. తనది కోటంరెడ్డి చెప్పినట్టు ఐఫోన్‌ కాదన్నారు. తనది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అన్నారు. తన ఫోనులో ప్రతి కాల్‌ రికార్డు అవుతుందని చెప్పారు. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్‌ కాదని.. అది ఆడియో రికార్డని వెల్లడించారు. కేవలం యాదచ్చికంగా కాల్‌ రికార్డు అయిందని చెప్పారు.  

ఈ వ్యవహారం ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ఇంత వివాదం అవుతుందని తాను ఊహించలేదని రామశివారెడ్డి తెలిపారు. ట్యాపింగ్‌ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నానన్నారు. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని  రామశివారెడ్డి తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మరోమారు స్పందించారు. తాను ఊహించినట్టే తన స్నేహితుడిపై ఒత్తిడి తెచ్చి తాము మాట్లాడుకున్న కాల్‌ కు సంబంధించి అది ఆడియో రికార్డింగ్‌ అని చెప్పించారని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పై విచారణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నేతలతో తనను తిట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ పై విచారణకు ముందుకొస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ఇప్పటికీ ట్యాపింగ్‌ లో ఉన్నాయని మరోసారి కోటంరెడ్డి బాంబుపేల్చారు. అమిత్‌ షా అపాయింటుమెంట్‌ ఇస్తే వెళ్లి కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.

మరోవైపు నెల్లూరు రూరల్‌ ఇంచార్జిగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి స్థానంలో నియమితుడైన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఇప్పటిదాకా కోటంరెడ్డి వర్గీయులుగా ముద్రపడ్డ కార్పొరేటర్లలో చాలా మంది ఆదాల ప్రభాకర్‌ రెడ్డి కార్యాలయంలో ఆయనను కలిసి మద్దతు ప్రకటించారు.

మరోవైపు నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లోనూ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోటంరెడ్డి బయటకు వెళ్లిపోవడంతో పార్టీ కేడర్‌ ఆయన వెంట న డవనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రతి మండలంలోనూ పర్యటించి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు భరోసా ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడానికి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే కార్పొరేటర్లకు ఏ సమస్యలు ఉన్న పరిష్కారనిస్తానని ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తనను కలసిన కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News