కృష్ణా టీడీపీపై క‌న్నేయండి బాబూ..!!

Update: 2022-07-15 03:29 GMT
రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటామ‌ని భావిస్తున్న టీడీపీలో పెద్ద క‌ల‌క‌లం రేగింది. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ డీలా పడింది. అత్యవసర చికిత్స చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు పెద్ద‌గా ఫ‌లితం ఇవ్వ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీ పరిస్థితి దిగజారుతోందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 2019 సాధా రణ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాల తో టీడీపీలో నిస్తేజం నెలకొంది. ఇటీవల మహానాడు నిర్వహించి పార్టీలో ఉత్తేజం నింపాలన్న చంద్రబా బు ప్రయత్నాలు ఫ‌లిస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

దీనికి కార‌ణం.. పార్టీలో పెద్ద నాయకులుగా ఉన్న‌వారు,  అనుకుంటున్న వారు కుటుంబ కలహాలతో కాలం గ‌డిపేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో వారు క్యాడర్‌లో పట్టుకోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల నాయకులు చంద్రబాబు, లోకేష్‌ వర్గాలుగా చీలి పరస్పరం కత్తులు దూసుకొంటున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితిని చూసి టీడీపీ క్యాడర్‌ డీలాపడిందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది..

గుడివాడలో టీడీపీ టికెట్‌ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జి, శిష్ట్లా లోహిత్‌లు ఎవ‌రికివారే అన్న‌ట్టుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. క‌లిసి క‌ట్టుగా ఉంటే త‌ప్ప ఇక్క‌డి ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీకొనే  ప‌రిస్థితి లేదు. అయితే.. ఈవిష‌యం తెలిసి కూడా నాయ‌కులు ఏక‌తాటిపైకి రాలేక పోతున్నారు. పైగా టికెట్ కోసం.. పోటీ మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొడాలి నానికి పోటీ ఇచ్చే నేత కోసం చంద్రబాబు జల్లెడపడుతున్నా ఫలితం క‌నిపించ‌డంలేదు.  ఇక‌, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకొనే ప‌రిస్థితి లేదు.

గన్నవరం వెళ్లాల్సిందిగా బయటి నియోజకవర్గాల నేతలను చంద్రబాబు కోరుతున్నారు. అయితే.. ఇక్క‌డ వ‌ల్ల‌భ‌నేనివంశీ దూకుడు ఎక్కువ‌గా ఉండ‌డంతో నేత‌లు ముందుకురావ‌డం లేదు.

పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్, యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్, దేవినేని గౌతం (పండు) వర్గాల ఆధిపత్య పోరు పెరిగిపోయింది. లోకేష్‌ ఆశీస్సులతో పండు వర్గం పెత్తనం చెలాయిస్తోం ది.  దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ, పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోడంతో నాయకత్వంపై క్యాడర్‌ విశ్వాసం కోల్పోయింది. మ‌రి ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు కాయ‌క‌ల్ప చికిత్స‌చేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News