శ్రీకృష్ణుడు.. ఈవ్ టీజర్.. ప్రశాంత్ భూషణ్

Update: 2017-04-03 04:46 GMT
మేధావులు.. గుణసంపన్నులు ఆచితూచి మాట్లాడటం నిన్నటి మాట. వీలైనంతవరకూ కసెక్కిపోయేలా మాట్లాడటం.. విపరీత వ్యాఖ్యలు చేయటం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటం.. కోట్లాది మంది మనోభావాల్ని కించపర్చటం ఇప్పుడు కొందరు మేధావులకు ఒక అలవాటుగా మారింది. సర్లే.. కానీ అంటూ ఇలాంటి ప్రముఖుల వివాదాస్పద వ్యాఖ్యల్ని పెద్ద మనసుతో చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నా.. వారు మాత్రం వెనక్కితగ్గటం లేదు. అలవాటులో భాగంగా ఎప్పటికప్పుడు మసాలా దట్టించిన మాటల్ని వదులుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కలకలానికి కారణమవుతున్నారు.

ప్రముఖ న్యాయవాది.. మేధావిగా చెప్పే ప్రశాంత్ భూషణ్ తాజాగా శ్రీకృష్ణునిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పురాణాల్లో శ్రీకృష్ణుడ్ ఈవ్ టీజర్ గా నిలిచినట్లుగా విపరీత వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఆకతాయిలకు వ్యతిరేకంగా అమలు చేస్తున్న ‘యాంటీ రోమియో’ కార్యక్రమాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. రోమియో ఒక్క అమ్మాయినే ప్రేమించాడని.. కానీ శ్రీకృష్ణుడు మాత్రం ఈవ్ టీజర్ గా నిలిచిపోయారన్నారు.

తన అనుచరులను కృష్ణ వ్యతిరేక బృందాలుగా పిలిచేందుకు యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు ధైర్యం ఉందా? అంటూ ట్వీట్ చేసిన ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారి.. పలువురు తప్పు పట్టేలా చేశాయి. ఆయన వ్యాఖ్యల్ని పలువురు తీవ్రంగా ఖండించారు. తన వ్యాఖ్యలకు ఇంత వ్యతిరేకత పెల్లుబికుతుందన్న విషయాన్ని ఊహించని ఆయన.. ఇప్పుడు మాట మారుస్తున్నారు. తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టించారని.. హిందూ సెంటిమెంట్లను అగౌరపర్చటం తన ఉద్దేశం ఎంతమాత్రం కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. చేయాల్సిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసేసి.. ఆ తర్వాత ఈ తరహా దిద్దుబాటు మాటలు చెప్పటం కొందరు నేతలకు అలవాటుగా మారింది. ఇందుకు ప్రశాంత్ భూషణ్ మినహాయింపు కాదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News