కేటీఆర్‌ - క‌విత‌.. నాన్న‌కు ప్రేమ‌తో!

Update: 2018-12-01 08:08 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిల్ల‌లు కేటీఆర్‌ - క‌విత‌. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం నాటి నుంచే వారిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉన్నారు. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక పార్టీలో - రాష్ట్రంలో కీల‌క నేత‌లుగా ఎదిగారు. వారిద్ద‌రూ ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఓ రెండు సీట్ల‌లో పార్టీ విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంటున్నార‌ట‌. ఆ రెండు స్థానాల‌ను గెల్చుకొని త‌మ తండ్రికి కానుక‌గా ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే అక్క‌డ విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నార‌ట‌.

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై కేటీఆర్‌ - జ‌గిత్యాల సీటుపై క‌విత ఇప్పుడు ప్ర‌త్యేకంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పులో కొండా సురేఖ భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇటీవ‌ల పార్టీని వీడిన ఆమె.. ప‌ర‌కాల నుంచి పోటీ చేస్తున్నారు. అయితే - ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ తూర్పులోనూ టీఆర్ ఎస్‌ ను గెల‌వ‌నివ్వ‌బోన‌ని పార్టీని వీడుతున్న‌ప్పుడు సురేఖ స‌వాల్ విసిరారు. అదే స‌మ‌యంలో కేసీఆర్‌ - కేటీఆర్‌ ల‌పై తీవ్ర‌స్థాయి విమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో వ‌రంగ‌ల్ తూర్పు సీటును గెల్చుకొని కొండా దంప‌తుల‌కు బుద్ధి చెప్పాల‌ని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టారు. అక్క‌డ టీఆర్ ఎస్ త‌ర‌ఫున న‌గ‌ర మేయర్ న‌రేందర్ బ‌రిలో ఉన్నారు. ఆయ‌న‌కు అన్నివిధాలా కేటీఆర్ సాయం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గ స్థానిక నేత‌ల‌తో కేటీఆర్ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. మైనారిటీలు వ‌రంగ‌ల్ తూర్పులో ఎక్కువ‌గా ఉండ‌టంతో వారిని ఆక‌ర్షించేందుకు కేటీఆర్ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌రంగ‌ల్ తూర్పు సీటును ద‌క్కించుకుంటే త‌న తండ్రికి మంచి కానుక అవుతుంద‌ని కేటీఆర్ భావిస్తున్నార‌ట‌.

ఇక జ‌గిత్యాల‌లో ప్ర‌జా కూట‌మి త‌ర‌ఫున కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి బ‌రిలో ఉన్నారు. కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డంలో ఆయ‌న నిరంత‌రం ముందుంటారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్‌ పై రెండుసార్లు పోటీ కూడా చేశారు. గ‌త ఎన్నిక‌ల్లోనే జీవ‌న్‌ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ ఎస్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించింది. అయితే - 7 వేల మెజారిటీతో ఆయ‌న గ‌ట్టెక్కారు. దీంతో ఈ ద‌ఫా ఎలాగైనా స‌రే జీవ‌న్‌రెడ్డిని ఓడించాల‌ని గులాబీ ద‌ళం ప‌ట్టుద‌ల‌తో ఉంది. అందులో భాగంగానే క‌విత జ‌గిత్యాల‌లో క‌లియ‌దిరుగుతున్నారు. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి త‌ర‌ఫున ఇంటింటి ప్ర‌చారానికి వెళ్తున్నారు. దాదాపు ప్ర‌తిరోజూ స‌మీక్షా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. జ‌గిత్యాల సీటును త‌న తండ్రికి కానుక‌గా ఇవ్వాల‌ని క‌విత యోచిస్తున్నారు. మ‌రి అన్నాచెల్లెళ్లు త‌మ ప‌నిలో విజ‌య‌వంత‌మ‌వుతారో లేదో మ‌రికొద్దిరోజుల్లో తేలిపోనుంది.
Tags:    

Similar News