కేటీఆర్ డైరెక్టుగా.. లోకేశ్ ఇండైరెక్టుగా

Update: 2016-07-06 11:06 GMT
తెలుగు రాష్ట్రాల యువనేతలు.. అంటే ఇద్దరు ముఖ్య మంత్రుల కుమారులను పోలుస్తూ తాజాగా నేషనల్ మీడియాలో వచ్చిన కథనమొకటి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ను పోలుస్తూ వారిద్దరి మధ్య వ్యత్యాసాలు - సామర్థ్యాలు.. వారిపై వారి తండ్రులకు ఉన్న అభిప్రాయం వంటి చాలా అంశాలను ప్రస్తావిస్తూ ‘‘ఎకనమిక్ టైమ్సు’’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ కథనంలో ఇద్దరినీ విశ్లేషించారు. కేటీఆర్ గురించి అంతటా సంతృప్తి ఉందని పేర్కొన్న ఎకనమిక్ టైమ్సు లోకేశ్ ను మాత్రం బ్యాక్ రూమ్ బాయ్ అంటూ అభివర్ణించింది.
    
కేటీఆర్ గురించి చేసిన విశ్లేషణలో... ఆయన పనితీరుపై తండ్రి కేసీఆర్ పూర్తి కాన్ఫిడెన్సుతో ఉన్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్ సాధించిపెట్టిన విజయంతో కేసీఆర్ కు మరింత నమ్మకం ఏర్పడిందని ఆ కథనంలో విశ్లేషించారు. అంతేకాదు.. న్యూయార్క్ లో పనిచేసిన కేటీఆర్ తన ఆంగ్లం - వ్యవహార శైలి కారణంగా పెట్టుబడులు ఇట్టే సాధిస్తున్నారని కూడా పేర్కొంది. సీఎం కుమారుడే అయినప్పటికీ ఎక్కడా హద్దులు దాటకుండా ఆరోపణలకు తావివ్వకుండా సాగుతున్నారని పేర్కొంది. కేసీఆర్ సమక్షంలో అతి కొద్ది మందితో నాలుగ్గోడల మధ్య జరిగే సమావేశాల్లోనూ కేటీఆర్ సీఎం తనయుడిలా హడావుడి చేయరని.. మిగతా నేతలు - మంత్రుల స్థాయిలోనే వ్యవహరిస్తారని కితాబిచ్చింది.
    
ఇక లోకేశ్ విషయానికి వచ్చేసరికి.. టీడీపీలో లోకేశ్ కు ప్రధాన కార్యదర్శి పదవి మాత్రమే ఉన్నప్పటికీ ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వమంతా నడుస్తుందని పేర్కొంది. మంత్రులకు ర్యాంకులు ఇవ్వడంలో.. వారి వద్ద సిబ్బందిని నియమించడంలో - అధికారుల బదిలీలు.. ఇలా ప్రతి విషయంలోనూ లోకేశ్ ప్రమేయం లేకుండా ఏమీ జరగని పరిస్థితి. చంద్రబాబు కూడా లోకేశ్ ను బాగా నమ్ముతున్నట్లు ఆ కథనంలో ప్రస్తావించారు. అయితే.. లోకేశ్ ను మాత్రం బ్యాక్ రూం బాయ్ అంటూ ఆయన పరోక్ష ఇన్వాల్వ్ మెంటుపై సెటైర్ వేశారు.
Tags:    

Similar News