గెలిచే వాడిని ప‌క్క‌న పెట్టాల‌ని కేటీఆర్ కు కోపం తెప్పించాడే!

Update: 2018-10-03 07:29 GMT
వినేవాడు ఉంటే చెప్పేవాడు చెల‌రేగిపోతాడ‌ని ఊరికే చెప్ప‌లేదేమో. ఇలాంటి అనుభ‌వ‌మే తాజాగా మంత్రి కేటీఆర్‌ కు ఎదురైంది. ఈ రోజున కేటీఆర్ అంటే ఏమిటి?  కేసీఆర్ కు ప్ర‌తిరూప‌మే. ఆయ‌న హాజ‌రు కావాల్సిన కార్య‌క్ర‌మాల‌కు.. పార్టీ విష‌యాల‌కూ ఆయ‌నే వెళుతున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కేసీఆర్ స్థానాన్ని కేటీఆర్ ఎలా భ‌ర్తీ చేస్తున్నాడ‌న్న విష‌యంపై భారీ ఎత్తున టెస్టింగ్ కార్య‌క్ర‌మం సాగుతోంది.

ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విజ‌యం సాధిస్తే.. ఆర్నెల్ల నుంచి ఏడాది వ్య‌వ‌ధిలో కేటీఆర్‌ కు ప‌ట్టాభిషేకం చేయాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌ని.. ఇందుకు సంబంధించి ఈ ఎన్నిక‌ల నుంచే ఆయ‌న్ను త‌న‌కు బ‌దులుగా పంపి.. ప‌నితీరు ఎలా ఉంద‌న్న విష‌యాన్ని మ‌దింపు చేసే ప్ర‌య‌త్నం జోరుగా సాగుతుంద‌ని చెప్పాలి.

ఇలాంటివేళ‌.. తాజాగా అస‌మ్మ‌తి నేత‌ల్ని బుజ్జ‌గించే టెస్ట్ కేటీఆర్‌ కు పెట్టారు కేసీఆర్‌. గ‌డిచిన కొద్దిరోజులుగా అస‌మ్మ‌తి నేత‌ల్ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసిన కేసీఆర్‌ కు తాజాగా మాత్రం దిమ్మ తిరిగిపోవ‌ట‌మే కాదు.. మంట పుట్టే మాట‌ల్ని వినే అనుభ‌వం ఎదురైంద‌ని చెబుతున్నారు.

మంగ‌ళ‌వారం ఒక్క‌రోజులో ఆయ‌న 9 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన అస‌మ్మ‌తి నేత‌లతో భేటీ అయ్యారు. అంద‌రిలోకి వ‌ర్థ‌న్న‌పేట అస‌మ్మ‌తి నేత త‌క్క‌ళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు మీటింగ్‌ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తున్నారు. ఊహించ‌ని రీతిలో వినిపించిన ఆయ‌న వాద‌న‌కు కేటీఆర్ కు ఎక్క‌డో కాలిన‌ట్లుగా చెబుతున్నారు.

వ‌ర్థ‌న్న‌పేట సీటును ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు కేటాయించార‌ని.. ఇప్ప‌టికే ప‌లు ప‌ద‌వులు పొందిన ఎర్ర‌బెల్లికి టికెట్ ఇచ్చే క‌న్నా.. త‌న‌కు ఇస్తే బాగుండేద‌న్న మాట‌ను ర‌వీంద‌ర్ నోటి నుంచి వ‌చ్చింద‌ట‌. అంతేకాదు.. ఆయ‌న ఎక్క‌డైనా గెలుస్తాడు.. అందుకు వ‌ర్ధ‌న్న‌పేట‌కే ఎందుకు ఇవ్వాల‌న్న ప్ర‌శ్న‌ను సంధించాడ‌ట‌.

దీంతో..ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేటీఆర్‌.. సునాయ‌సంగా గెలిచే అభ్య‌ర్థికి టికెట్ ఇవ్వొద్ద‌ని కోరుకోవ‌టంలో అర్థం లేద‌న్న మాట‌ను చెప్ప‌ట‌మే కాదు.. ఇలా మాట్లాడ‌టం ఏ మాత్రం భావ్యం కాద‌ని చెప్పిన‌ట్లు చెబుతున్నారు. టికెట్లు రాని స‌మ‌ర్థుల‌కు వేరే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న అభ‌యం త‌ర్వాత కూడా అస‌మ్మ‌తి పేరుతో ర‌చ్చ చేయ‌టాన్ని కేటీఆర్ సీరియ‌స్ గా తీసుకున్న‌ట్లు చెప్పారు. మొత్తానికి.. స‌మ‌ర్థుడు.. గెలుపు ప‌క్కా అన్న నేత‌ల‌కు సైతం టికెట్లు ఎందుకు ఇచ్చారంటూ అడుగుతున్న గులాబీ నేత‌ల తీరు కేటీఆర్ కు ఇబ్బందిక‌రంగా మార‌ట‌మే కాదు.. ఆయ‌న టోన్ లో తేడా వ‌చ్చి క‌టువుగా మాట్లాడారంటున్నారు.
Tags:    

Similar News