హుజూరాబాద్ లో కురుక్షేత్రం.. గెలుపు ధ‌ర్మానిదేః ఈట‌ల‌

Update: 2021-07-25 06:45 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లకు ఇంకా నోటిఫికేష‌న్ రానేలేదు. కానీ.. ఎన్నిక‌ల యుద్ధం మాత్రం అప్పుడే మొద‌లైంది. ఈ ఎన్నిక ఇటు ఈట‌ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ను నిర్ణ‌యించేది కావ‌డం.. అటు టీఆర్ఎస్ బ‌లాన్ని తేల్చ‌ది కావ‌డంతో ఎవ‌రికి వారు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని పోరాటం ఆరంభించారు. అయితే.. కేసీఆర్ అధికారాన్ని ఉప‌యోగించి ద‌ళిత బంధు వంటి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ.. ఆ వైపుగా న‌రుక్కొస్తున్నారు. ఇటు ఈట‌ల రాజేంద‌ర్ నేరుగా జ‌నంలోకి వెల్తున్నారు. ‘ప్రజాదీవెన’ పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ఎండా, వాన‌తో సంబంధం లేకుండా ఈట‌ల రాజేంద‌ర్ పాదయాత్ర కొన‌సాగుతోంది.

ఇల్లంత‌కుంట మండ‌లంలో ప‌ర్య‌టిస్తున్న ఈట‌ల రాజేంద‌ర్‌.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను కురుక్షేత్ర స‌మ‌రంతో పోల్చారు. ఇది ధ‌ర్మానికీ, అధ‌ర్మానికీ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధ‌మ‌ని చెప్పారు. ఇందులో న్యాయ‌మే గెలిచి తీరుతుంద‌ని అన్నారు. ఇది కేవ‌లం త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించే ఎన్నిక మాత్ర‌మే కాద‌ని చెప్పిన ఈట‌ల‌.. కేసీఆర్ అహంకారాన్ని పాత‌ర వేస్తామ‌ని చాటి చెప్పే ఎన్నిక అని అన్నారు.

త‌న వెంట ఎవ‌రూ ఉండ‌కుండా చేయాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. ‘‘ప్రాణం ఉండ‌గానే బొంద‌పెట్టాల‌ని చూస్తున్నారు. న‌న్ను సంపుకుంట‌రా.. సాదుకుంట‌రా? అన్న‌ది మీ చేతుల్లోనే ఉంది. రాజ‌కీయంగా కొట్లాడాల్సిందిపోయి.. మ‌నుషుల‌ను కొనుక్కునే స్థాయికి కేసీఆర్ దిగ‌జారిండు.’’ అని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇన్నాళ్ల త‌న గెలుపు కేసీఆర్ బొమ్మ ద్వారానే వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పైనా ఈట‌ల స్పందించారు. ‘‘నా బొమ్మ పెట్టుకొని, నా పేరు చెప్పుకొని, నేను బీఫామ్ ఇస్తే.. రాజేంద‌ర్ గెలిచిండ‌ని కేసీఆర్ అంటున్నాడు. మ‌రి, అదే బీఫామ్‌, అదే జెండాతో పోటీచేసిన నీ బిడ్డ‌ను ఎందుకు గెలిపించుకోలేక‌పోయావు? నా ఉద్య‌మ స‌హ‌చ‌రుడు వినోద్ కుమార్ ను ఎందుకు గెలిపించుకోలేక‌పోయావ్‌?’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌శ్నించారు.

కేవ‌లం ప్ర‌శ్నించేవారు ఉండొద్ద‌నే ఉద్దేశంతోనే కేసీఆర్ త‌న‌ను బ‌య‌ట‌కు పంపించార‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న‌ 119 నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లంద‌రికీ నేరుగా త‌న‌తోనే కాంటాక్ట్ ఉండాల‌ని భావిస్తున్నాడ‌ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవ‌రూ ప్ర‌త్యేకంగా బ‌ల‌ప‌డొద్ద‌ని భావిస్తున్నార‌ని అన్నారు. తానొక్క‌డిని మేధావిని అని కేసీఆర్ భావిస్తాడ‌ని ఆరోపించారు. రాష్ట్రంలో చిన్న పిల్ల‌ల‌ను అడిగినా.. కేసీఆర్ అహంకారం గురించి చెబుతార‌ని, ఇక‌మీద‌ట కేసీఆర్ పాల‌న రాష్ట్రానికి ఏ మాత్రం క్షేమం కాద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని ఈట‌ల రాజేంద‌ర్ చెప్పుకొచ్చారు.

ఉద్య‌మ కాలంలో ప్ర‌జ‌ల‌ను, ధ‌ర్మాన్ని, చైత‌న్యాన్ని న‌మ్ముకున్న కేసీఆర్‌.. ఇప్పుడు మాత్రం డ‌బ్బు, దౌర్జ‌న్యం, అహంకారాన్ని న‌మ్ముకున్నాడ‌ని అన్నారు. ఆ విధంగా న‌యా నిజాం మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. టీఆర్ఎస్ లోని ఎ మ్మెల్యేలు గంగిరెద్దుల‌తో స‌మాన‌మ‌ని, మంత్రుల‌ను మంత్రులుగా కాకున్నా.. క‌నీసం మ‌నుషులుగా అయినా చూడాల‌ని వేడుకునే దుస్థితి వ‌చ్చింద‌ని ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సంఘ‌ట‌న‌ను కూడా ఉద‌హ‌రించారు.

2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక‌వేళ నా పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉంటే.. ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు స్వేచ్ఛ ఇస్తే.. న‌న్ను కోఠి చౌర‌స్తాలో అమ్మేస్తార‌ని కేసీఆర్ అన్నట్టుగా ఈట‌ల చెప్పారు. అంతేకాకుండా.. ఆ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు కుట్ర జ‌రిగింద‌ని ఈట‌ల అన్నారు. ఒక‌వైపు టీఆర్ఎస్ ను గెలిపించాల‌ని తాను తిరుగుతుంటే.. త‌న‌ను ఓడించేందుకు ప్ర‌త్య‌ర్థుల‌కు కేసీఆర్ డ‌బ్బు సంచులు పంపించార‌ని ఆరోపించారు. అయిన‌ప్ప‌టికీ.. హుజూరాబాద్ ప్ర‌జ‌లు 47 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించార‌ని అన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లోనూ త‌న‌ను గెలిపిస్తార‌ని, 2023లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News