బాబుపై కేవీపీ.. ప్రశ్నలు, విమర్శలు!

Update: 2017-01-03 11:34 GMT
ఎప్పుడుపడితే అప్పుడు - ఏది పడితే అది మాట్లాడకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయం అనే స్థాయిలో స్పందిస్తుంటారు కేవీపీ రామచంద్ర రావు. వైఎస్సార్ ఆత్మగా పిలవబడే ఈయన తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొదలైన దగ్గరనుంచి పోలవరానికి ఇందిరా గాంధీ పేరు తీసెయ్యడం - నాబార్డు నిధులను సాధించామని చెప్పుకోవడం వరకూ అన్ని విషయాలపైనా తనదైన ప్రశ్నలను కురిపించారు కేవీపీ. ఇదే సమయంలో చంద్రబాబుకి అల్జీమర్స్ వ్యాధి ఉందని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన కేవీపీ.. మరోసారి ఆ వ్యాది తీవ్రతపై స్పందించారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు రాజకీయ బిక్ష పెట్టి ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అవకాశం - రాజకీయ జీవితం ఇచ్చిన స్వర్గీయ ఇందిరా గాంధీ పేరునే పోలవరం ప్రాజెక్టుకు తీసివేస్తారా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టిన కేవీపీ... పోలవరం ప్రాజెక్టులో టీడీపీ పాత్ర ఒక్కశాతం కూడా లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకూ పోలవరంపై అన్నీ అసత్య ప్రచారాలు చేస్తున్న ఏపీ సర్కారు... అసలు ఆ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు, ఎవరు ఆ ప్రాజెక్టు నిర్మాణంపై కలలు కన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక పోలవరం చరిత్రపై మాట్లాడిన కేవీపీ... స్వాతంత్రానికి ముందే పోలవరంపై ప్రయత్నాలు జరిగాయని, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో కృష్ణ అయ్యంగార్ నుంచి కేఎల్ రావు ఆలోచనల నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు వచ్చిందని, ఈ విషయాలు తెలిసో తెలియకో చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అంజయ్య కేబినెట్లో సహాయ మంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబుకు పోలవరం గుర్తులేదా అని ప్రశ్నించారు కేవీపీ. 1983 నుంచి ఒక్క ఐదేళ్లు మినహా మిగిలిన కాలం గరిష్టంగా టీడీపీ ఆధ్వర్యంలోనే సాగిందని, ఆ సమయంలో ఎప్పుడైనా పోలవరం అనే మాటనైనా ఉచ్చరించారా.. దానికి సంబందించిన రికార్డులు ఏమైనా చూపించగలరా అని నిలదీశారు. ఇప్పటివరకూ నాబార్డు నుంచి పద్దెనిమిది వందల కోట్ల చిల్లర సాధించి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు, ఈ కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాని కేంద్రానికి తాకట్టు పెట్టారని కేవీపీ విమర్శించారు.

ఇదే క్రమంలో గతంలో చంద్రబాబు అల్జీమర్స్‌ అనే వ్యది ఉందని బాంబు పేల్చిన కేవీపీ... తాజాగా మరోసారి ఆ వ్యాది పేరుచెప్పి బాబును ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే... చంద్రబాబుకు సరైన వైద్యం అవసరమని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News