కేవీపీ ఇంకో ఫిట్టింగ్ పెట్టేశారు

Update: 2016-11-20 05:50 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆత్మీయ మిత్రుడు - కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు త‌న స‌హ‌జ సిద్ధ‌మైన దోర‌ణిని విడిచిపెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తెర‌వెనుక ఉండటం - చాలా త‌క్కువ అంశాల్లో స్పందించ‌డం వంటి తీరుకు కేవీపీ టాటా చెప్పిన‌ట్లుగా ఉంద‌ని తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేయ‌డంలో కేవీపీ మ‌రో అడుగు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణాన్ని పీపీపీ పద్ధతిలో చేపట్టవద్దని కోరుతూ తాజాగా చంద్ర‌బాబుకు కేవీపీ లేఖ రాశారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం తీరుకు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు సాగుతున్న తీరును కేవీపీ ప్ర‌శ్నించారు.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ నాడు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం శంకుస్థాపన సమావేశంలో మాట్లాడుతూ భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించకూడదని సూచించారని త‌న లేఖ‌లో కేవీపీ ప్ర‌స్తావించారు. కృష్ణపట్నం - గంగవరం ఓడరేవులను ప్రైవేట్‌ పరం చేయటం వలన ప్రభుత్వానికి ఎలాంటి లాభం రావటం లేదు కాబట్టి భావనపాడును ప్రైవేట్ రంగానికి ఇవ్వకూడదని చెప్పలేదా? అని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ప్ర‌శ్నించారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు - మీ సమక్షంలోనే గడ్కరీ ఈ సూచన చేయలేదా? అని చంద్ర‌బాబును కేవీపీ నిల‌దీశారు. భావనపాడు ఓడరేవును కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఈ ఓడ రేవు ద్వారా వచ్చే ఆదాయం నుండి 25 నుండి 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని గడ్కరీ ప్రకటించలేదా? అని రామచంద్రరావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గడ్కరీ చేసిన ప్రతిపాదనను పక్కన పెట్టి భావనపాడును ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేయటం మంచిది కాదని తన‌ లేఖలో కేవీపీ స్పష్టం చేశారు. మొదటి దశలో ఐదు బెర్త్‌ లను నిర్మించేందుకు రెండు వేల ఐదు వందల కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తారా? అని కూడా నిలదీశారు. భావనపాడును ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని ఆయన హెచ్చరించారు. భావనపాడును పబ్లిక్ రంగంలో చేపడితే స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని కేవీపీ సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News