హుజూరాబాద్ లో మహిళల ఓటు ఎవరికి?

Update: 2021-10-23 15:30 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ వర్సెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య ఇక్కడ హోరాహోరీ నెలకొంది.  ఈటల రాజేందర్ ను ఓడించడానికి సీఎం కేసీఆర్ పంతం పట్టి పనిచేస్తున్నారు. మంత్రి హరీష్ రావుతోపాటు ఇతర మంత్రులంతా అక్కడ దిగి నానా హంగామా చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ , ఎంపీ అరవింద్, ఇతర నేతలు మోహరించడంతో వాడివేడిగా సాగుతోంది.

హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ప్రధాన పోటీ ఉంది. మధ్యలో ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయ్యింది.  ప్రచారంలో మాత్రం టీఆర్ఎస్, బీజేపీ నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ప్రచారం ముగింపునకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు తమ శక్తిమేర అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రధానం కేంద్ర వైఫల్యాలపై ఫోకస్ పెడుతోంది. పెట్రోల్, డిజీల్, వంటగ్యాస్ పెరుగుదల, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్, దళితబంధు వంటి పథకాలను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఈటల రాజేందర్ స్వార్థంతోనే ఉప ఎన్నిక వచ్చిందంటూనే బీజేపీ విధానాలను టీఆర్ఎస్ నేతలు తూర్పార పడుతున్నారు.

కాంగ్రెస్ లో జోష్ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం కావడంతో కాంగ్రెస్ రేసులో ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో చేసిన ఆలస్యం ఆపార్టీకి మైనస్ గా మారింది. చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నియోజకవర్గాన్ని చుట్టిరావడం సమస్యగా మారింది. అంతే కాకుండా ఆయన స్థానికేతరుడు కావడం కూడా కాంగ్రెస్ పార్టీని రేసులో వెనుకబడేసినట్లు కన్పిస్తోంది. దీంతో ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యననే స్పష్టమవుతుంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సీన్ మారిపోవడంతో ఓటర్లు ఈ రెండు పార్టీల ప్రచారాన్ని నిషితంగా గమనిస్తున్నారు.

ఈటల గెలుపు కోసం జాతీయ నాయకులు రంగంలోకి దిగారు. ఈనెల 21 నుంచి కేంద్ర మంత్రులు హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. కేంద్రంపై ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పికొట్టాలని భావిస్తున్నారు.

హుజూరాబాద్ ప్రజల ఓటు ఎటు అనేది అంతుబట్టడం లేదు. మహిళలు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడంతో వారి ఓటు ఎటు అనేది ఆసక్తిగా మారింది. కొన్ని సర్వేలు చేస్తున్నారు. ఏ మహిళను పలకరించినా తమకు ఇష్టం ఉన్నవారికే వేస్తామంటున్నారు. మహిళలపై దృష్టిపెట్టిన కేసీఆర్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది. 150 మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటివరకూ ఎప్పుడూ ఇలా ఒకేసారి ఇంత మొత్తంలో మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించలేదు. దీనికి తోడు ఈనెల 25న  టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక వేళ మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే హుజూరాబాద్ లో మెజార్టీ సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఈటల సతీమణి జమున రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. భర్త గెలుపే లక్ష్యంగా ఈటల జమున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద మహిళలు అత్యధికంగా ఉండడంతో వారు మెచ్చిన నేతే హుజూరాబాద్ లో గెలువనున్నారు. ఈ ఉప ఎన్నిక ప్రచారం చూస్తుంటే మాత్రం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు సవాలుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News