బాబు ఫోబియాతో...భారీ రిస్క్ కి దిగిన వైసీపీ...?

Update: 2022-03-22 08:41 GMT
వైసీపీకి చంద్రబాబు ఫోబియా ఉందని అంటారు. ఇది పన్నెండేళ్ళ ఆ పార్టీ ప్రస్థానంలో అడుగడుగునా కనిపిస్తుంది. నిజానికి చంద్రబాబు జగన్ విషయంలో తొలి రోజుల నుంచే చేయాల్సింది అంతా చేశారని చెబుతారు. జగన్ సీబీఐ చేతిలో అరెస్ట్ కావడం, పదహారు నెలలు జైలు జీవితం అనుభవించడం వెనక కాంగ్రెస్ పాత్రతో పాటు బాబు పాత్ర కూడా ఉందని వైసీపీ నిశ్చితాభిప్రాయం. దానికి తగినట్లుగానే కాంగ్రెస్ పెట్టిన కేసుల‌లో టీడీపీ ఇంప్లీడ్ అయింది కూడా.

ఆ తరువాత అలా పొలిటికల్ టర్న్ తీసుకుని పదేళ్ళుగా ఏపీ రాజకీయాలు  జగన్ వర్సెస్ బాబు గా మారిపోయాయి. ఇక ఒకసారి బాబు గెలిచారు. ఇపుడు జగన్ ఏలుబడి సాగుతోంది. అయినా సరే టీడీపీ జగన్ని టార్గెట్ చేస్తే వైసీపీ బాబు మీదనే గురి పెడుతుంది. అయితే ఈ గురి పెట్టే విధానంలో టీడీపీ టాలెంట్ వేరు. వైసీపీది చూస్తే మరో రకంగా ఉంటుంది.

బాబు మీద ఏ ఆరోపణ వచ్చినా వెంటనే వైసీపీ దూకుడు పెంచేస్తుంది. ఆ విషయంలో చాలా దూరం వెళ్తుంది కూడా. లేటెస్ట్ గా అలాంటిదే ఇపుడు జరుగుతోంది. పెగాసస్ స్పై సాఫ్ట్ వేర్ ని ఏపీ సర్కార్ నాడు అంటే చంద్రబాబు జమానాలో కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శాసనసభలో ఆరోపించినట్లుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

దాంతో ఏపీ రాజకీయాలు మొత్తం పెగాసస్ మీదనే సాగుతూ వస్తునాయి. దానికి పరాకాష్ట అన్నట్లుగా ఏకంగా శాసనసభలో చర్చ జరిపి వైసీపీ ప్రభుత్వం పెగాసస్ మీద సభా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని స్పీకర్ ని  కోరింది. త్వరలో సభాసంఘం కూడా ఏర్పాటు అవుతుంది. మరి ఈ సభా సంఘం ఏపీలో పెగాసస్ ని నాటి సర్కార్ కొనుగోలు చేసిందా లేదా అన్నది నిగ్గు తేల్చాల్సి ఉంది.

అయితే ఇక్కడే చాలా సందేహాలు వస్తున్నాయి. పెగాసెస్ మీద ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ మీదనే ఆధారపడి ఏపీలో వైసీపీ సభా సంఘం దాకా వెళ్ళింది. దీని మీద ఇపుడు లాజిక్ పాయింట్ ఏంటి అంటే మమత ఎక్కడ దాన్ని  మాట్లాడారు, ఎపుడు మాట్లాడారు అన్నది చూడడం. మమత అసెంబ్లీలో అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

నిజానికి అసెంబ్లీలో మమత మాట్లాడితే ఆమె అన్న మాటలు ఈ పాటికే వీడియోల రూపంలో బయటకు రావాలి కదా. అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ కావాలి కదా. పోనీ ఎవరూ రికార్డు చేయలేదా అంటే అసెంబ్లీ సెషన్ లో అన్నీ రికార్డెడ్ గానే ఉంటాయి. మరి మమత అన్నారు అని  వీడియో రికార్డెడ్ గా అయితే ఈ రోజుకీ ఆధారాలు లేవు.

దాని మీద వైసీపీ వారు అయితే వాటిని సంపాదించాలని చూస్తున్నామని అంటున్నారు. మరో వైపు సభా సంఘం విచారణ అంటే అన్ని వైపుల నుంచి జరగాలి. అవసరం ఐఏ మమతా బెనర్జీ వివరణ కూడా తీసుకుంటారా అన్న చర్చ వస్తోంది. ఆమె అలా వివరణ ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఇక మమత అన్నారని అంటున్నారు,  దాని మీదనే వైసీపీ రాజకీయ రాద్ధాంతం చేస్తోంది. రేపటి రోజున ఇదే మమత తనక్జు తప్పుగా సమాచారం వచ్చింది కాబట్టి పొరపాటున చెప్పాను అని ట్విస్ట్ ఇస్తే అపుడు వైసీపీ వారు ఏం చేస్తారు.

అపుడు సభాసంఘం ఏం చేస్తుంది అన్న ప్రశ్నలూ వస్తున్నాయి. నిజానికి ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు వాటి మీద తొలి దశలో ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించాలి. అందులో ఏ మాత్రం ఆధారాలు దొరికినా వాటి మీద సభా సంఘాలు వేసినా పక్కాగా ఉంటుందని అంటున్నారు.

ఇక దీని మీద తెలుగుదేశం వాదన అయితే  క్లారిటీగా ఉంది. ఆ పార్టీ వారు ఏమంటున్నారు అంటే తాము పెగాసస్ సాఫ్ట్ వేర్ ని కొనుగోలు చేశామనే అంటున్నారు కదా. మరి వైసీపీ సర్కార్ వచ్చి దాదాపుగా మూడేళ్ళు అవుతోంది కదా. ఇంతటి తీవ్రమైన ఇష్యూ ఉంటే ఇన్నాళ్ళూ ఏం చేసారు అన్న ఎదురు ప్రశ్నిస్తోంది.

తమక్జు పెగాసస్ గురించి ఇపుడే తెలిసింది అని  వైసీపీ నేతలు అంటున్నా విపక్షంలో ఉన్నపుడు తమ ఫోన్లను టీడీపీ సర్కార్ ట్యాప్ చేసింది అని గగ్గోలు పెట్టారు కదా. మరి పవన్ లోకి వచ్చిన తరువాత వాటి మీద అయినా విచారణ జరిపారా అని ప్రశ్నిస్తోంది. అంటే తాము అలాంటి తప్పుడు పనులు చేయలేదని వైసీపీకి తెలుసు. కేవలం రాజకీయంగా బురద జల్లడానికే ఇపుడు ఇలా అంటున్నారు అని టీడీపీ వారు చెబుతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పెగాసస్ విచారణ విషయం మొత్తం అంతా మమత ఆరోపణల మీదనే బేస్ చేసుకుని వైసీపీ ముందుకు సాగడం వల్ల రేపటి రోజున ఏదైనా  తేడా కొడితే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఇంతకీ పెగాసస్ మీద విచారణ అంటే కొండను తవ్వితే చివరికి ఎలక అయినా దొరుకుతుందా అన్నదే అతి పెద్ద డౌట్.
Tags:    

Similar News