సన్ రైజర్స్.. హైదరాబాదీలను నిరాశపర్చకుమా..?

Update: 2022-04-04 11:46 GMT
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 15వ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ కూడా రెండు ఓడిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడింది ఒక్కటే.. ఓడింది ఒక్కటే. కానీ, మిగతా రెండు జట్ల సంగతి ఏమో గానీ.. హైదరాబాద్ మళ్లీ మెరుగుపడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టోర్నీలో జట్టు ఆడిన మ్యాచ్ ను చూస్తే  హైదరాబాద్ అభిమానులు ముక్కున వేలేసు కోవాల్సిందే. గత నెల 29 న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట రాజస్థాన్ కు 210 పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్ బదులుగా చేసింది 149 పరుగులే. కెప్టెన్ విలియమ్సన్ (2) సమా టాప్4 లోని నలుగురిలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ రమ్ (57) చివర్లో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (14 బంతుల్లో 40) చెలరేగడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. లేదంటే ఓటమి అంతరం 100 పరుగులైనా ఉండేదే.

బ్యాటింగ్ లేదు.. బౌలింగూ లేదు

వార్నర్,  ధావన్ ఓపెనింగ్ తో మిడిలార్డర్ లో బెయిర్ స్టో, మనీష్ పాండే హిట్టింగ్ తో సన్ రైజర్స్ బ్యాటింగ్ ఒకప్పుడు బాగుండేది. దీనికితోడు భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్ లతో కూడిన బౌలింగ్ అదరగొట్టేది. 130-140 పరుగుల లక్ష్యాన్ని అయినా  కాపాడుకునేది. ఇప్పుడతా మ్యాజిక్ అంతా మాయమైంది. బౌలర్లు తేలిపోతున్నారు. గత మ్యాచ్ లో నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, సుందర్ 11 ఓవర్లలోనే 129 పరుగులిచ్చారు. దీన్నిబట్టే సన్ రైజర్స్ బలహీనత ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోంది.

లక్నో మీదయినా నిలుస్తుందా?

ఈ నేపథ్యంలో సోమవారం సన్ రైజర్స్ .. లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. అద్భుత ఫామ్ లో ఉన్న లక్నో మీద గెలవాలంటే సన్ రైజర్స్ కాస్త కష్టపడాల్సిందే. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయీస్, దీపక్ హుడాలతో లక్నో పెద్ద పవర్ ప్యాక్ లా ఉంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ సోమవారం నుంచి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. హోల్డర్ ఇటీవల బంతి, బ్యాట్ తోనూ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి లక్నో ను సన్ రైజర్స్ నిలువరిస్తే గొప్పే.

సన్ రైజర్స్ ను చెన్నై తో పోల్చుతూ మీమ్ లే మీమ్ లు..

మెగా టీ20 లీగ్‌లో హైదరాబాద్‌ అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చని సామాజిక మాధ్యమాల్లో చెన్నై అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ టీ20 లీగ్‌లో చెన్నై వరుసగా మూడు మ్యాచ్‌లు కోల్పోవడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా లఖ్‌నవూ, పంజాబ్‌ లాంటి జట్లతోనూ ఓటమిపాలవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌
అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చంటూ మరింత హాస్యం జోడిస్తూ వారు ట్వీట్లు చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఈ వారాంతం చెన్నైతోనే తలపడాల్సి ఉంది. అప్పుడు కూడా చెన్నై ఓడిపోతుందని, దీంతో ఆ జట్టుకన్నా హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్తుందని అభిమానులు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌ టీమ్‌ ఇప్పటివరకు ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలై.. రన్‌రేట్‌ పరంగా మరీ  వెనుకంజలో ఉండటంతో పదో స్థానంలో కొనసాగుతోంది. చెన్నై ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది.
Tags:    

Similar News