ఊరించే ‘అల్లరిపిల్ల’ ఖాతా వెనుకున్న గ్యాంగ్ గురించి తెలిస్తే గగుర్పాటే

Update: 2022-03-09 05:08 GMT
ప్రజల బలహీనతల్ని అసరా చేసుకొని మోసం చేయటం.. లక్షలాది రూపాయిలు కొట్టేసే టెక్నిక్ ను మోసగాళ్లు.. నేరస్తులు ఈ మధ్యన ఒక ఆయుధంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలకు.. అందునా ఏపీకి చెందిన పలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ‘అల్లరి పిల్ల’ పేరుతో ఉండే ఫేస్ బుక్ అకౌంట్ ఆకర్షిస్తూ ఉంటుంది. తొలుత ఫ్రెండ్ రిక్వెస్టు తో మొదలై.. తియ్యటి మాటలతో ముగ్గులోకి దించటం.. ఆ తర్వాత హాఫ్ న్యూడ్ వీడియోలతో కిక్కెక్కించటం.. వల విసిరి.. ఒడుపుగా ఫోన్ ను హ్యాక్ చేసి డబ్బులు కాజేయటం వీరికి అలవాటు.

తాజాగా దీని బాధితుడు విశాఖపట్నానికి చెందిన మౌనిక్ అనే కుర్రాడు ఏకంగా రూ.3.64లక్షల్ని పోగొట్టుకున్నాడు. తాను మోసపోయిన వైనాన్ని పోలీసులకు తెలిపి.. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా ఈ అల్లరిపిల్ల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొన్నారు. తమదైన విచారణతో తీగ లాగిన పోలీసులకు డొంక కదిలింది. దీంతో.. చిత్తూరు జిల్లా పోలీసులు అల్లరిపిల్ల వెనకున్న మాఫియా గుట్టు రట్టు చేశారు.

కన్నింగ్ ఆలోచనలతో ముగ్గులోకి దింపి.. కవ్వింపు మాటలతో మత్తెక్కించి.. వీడియో కాల్ తో విచక్షణ మరిచేలా చేసి.. తన మత్తులో పూర్తిగా పడ్డారని నిర్దారించుకున్న తర్వాత అసలు కథ షురూ చేస్తారు. ఒక లింకు పంపి.. దాన్ని క్లిక్ చేయాలని కోరుతారు. అందుకు ఓకే చేస్తే చాలు.. సదరు బకరాకు చెందిన బ్యాంకు ఖాతాలన్ని ఈ మాఫియా చేతుల్లోకి వచ్చేస్తాయి.

అక్కడి నుంచి వారి బ్యాంకు ఖాతాను ఊడ్చే పనిలో పడతారు. తమ పని పూర్తి చేసుకున్న తర్వాత పత్తా లేకుండా పోతారు. ఈ అల్లరిపిల్ల వెనక ఉన్నదెవరన్న విషయాన్ని గుర్తించేలా విచారణ మొదలు పెట్టిన పోలీసులకు షాకింగ్ అంశాల్ని గుర్తించారు. అల్లరిపిల్ల వెనకున్న బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదని.. పెద్ద నెట్ వర్క్ అన్న విషయాన్ని తేల్చారు.

విశాఖకు చెందిన సాంబశివరావు.. అనంద్ మెహతా.. గొంతెన శ్రీను.. కుమార్ రాజా.. లోకిరెడ్డి మహేశ్.. శివకుమార్ తో పాటు.. వరంగల్ కు చెందిన శ్రావణ్ కుమార్.. కడపకు చెందిన సుధీర్ కుమార్ అలియాస్ సుకు.. అలియాస్ హనీలతో పాటు.. అల్లరిపిల్ల పాత్రధారి మానసను గుర్తించారు. అందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మానసను మాత్రం పట్టుకోలేకపోయారు.

ఆమె మిస్ అయ్యిందని.. పరారీలో ఉన్నప్పటికీ ఆమెను పట్టుకొని తీరతామని చిత్తూరు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వర్చువల్ ప్రపంచంలో తారసపడే అల్లరిపిల్ల లాంటి బ్యాచ్ చాలామందే ఉంటారు. ఒకరు ఒకలా మోసం చేస్తే.. మరొకరు ఇంకోలా మోసం చేయటం కనిపిస్తుంది. అందుకే.. తొందరపాటుకు పోకుండా ఇలాంటి మత్తుకు బానిసలైతే.. మొత్తం ఊడ్చేస్తారన్నది మర్చిపోకూడదు. సో.. అల్లరి పిల్ల అసలు లెక్క ఏమిటన్నది చిత్తూరు పోలీసులు తేల్చేశారు.
Tags:    

Similar News