మాల్దోవానూ మింగేస్తుందా? రష్యా?

Update: 2022-03-04 01:30 GMT
15 ముక్కలుగా విడిపోయిన పూర్వపు సోవియట్ యూనియన్ ను తిరిగి ఏకం చేయాలనే లక్ష్యంతో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తదుపరి చర్య ఏమిటి? ఇప్పటికే ఉక్రెయిన్ ను ఊపిరిసలపకుండా చేస్తున్న ఆయన.. మరో అడుగు ఎటు వేస్తారు? ఈసారి టార్గెట్ ఏం కాబోతోంది? ఉక్రెయిన్ నిస్సైనికీకరణ అంటూ ప్రారంభించిన దాడి వారం రోజులు పూర్తయిన వేళ రష్యా అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పటికే స్పష్టమైపోయింది. ఉక్రెయిన్‌ రాజధానితోపాటు ప్రధాన నగరాలపై భీకర దాడులతో విరుచుకుపడుతూ తమ గోల్ ఏమిటో చెప్పకనే చెబుతోంది.

బుధవారం భారీ కాన్వాయ్‌తో సైనిక బృందాలను ఉక్రెయిన్‌లోకి పంపింది. దీన్నిబట్టి చూస్తే ఈ అడుగులు ఉక్రెయిన్ తో ఆగవని ఇంకా ఏటువైపో పడనున్నాయని తెలుస్తోంది. అదేంటనేది చూచాయగా.. రష్యా మిత్ర దేశం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో తాజాగా తమ దేశ కీలక భద్రతా మండలికి వివరించినదాన్నిబట్టి తెలిసిపోతోంది. రష్యా టార్గెట్‌.. చిన్న దేశం, ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన మాల్దోవా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైనిక చర్య క్రమాన్ని వివరిస్తూ లుకషెంకో వివరించిన కీలక మ్యాప్‌ అసలు పన్నాగాన్ని తేటతెల్లం చేస్తోంది.

పుతిన్ కు ఆప్తుడే చెబుతున్నాడు..

ఉక్రెయిన్- రష్యా మధ్య ఉండే దేశం బెలారస్. 30 ఏళ్లుగా దీనికి లుకషెంకోనే అధ్యక్షుడు. రెండేళ్ల క్రితం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నా.. పుతిన్ చొరవతో బయటపడి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత యుద్ధంలో రష్యాకు అన్నివిధాల మద్దతిస్తున్న ఏకైక దేశం బెలారస్. చివరకు చర్చలు కూడా ఈ దేశంలోనే జరుగుతున్నాయి.

కాగా,  ఉక్రెయిన్‌ పరిస్థితులపై లుకషెంకో తమ దేశ భద్రతామండలిలో చర్చించారు. ముఖ్యంగా సైనిక చర్యపై రష్యా ప్రణాళిక, వారి సేనలు మోహరిస్తున్న వాహనాలు, ఆయుధ సామగ్రి, ఉక్రెయిన్‌ నగరాలపై దాడుల క్రమాన్ని మ్యాప్‌లో చూపిస్తూ వివరించారు. ఉక్రెయిన్‌ను నాలుగు భాగాలుగా చూపారు. దక్షిణ ఉక్రెయిన్‌ నుంచి ‘మాల్దోవా’ లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగుతున్నాయని  పేర్కొన్నారు. మాల్దోవా వైపు రష్యా బలగాలు కదిలే మార్గాలు ఆ మ్యాపులో ఉన్నాయని వెల్లడించాయి.

బెలారస్‌ అధ్యక్షుడు ఆ మ్యాపులో వివరించినట్లుగానే రష్యా సేనలు దాడులు చేస్తుండడం ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే, ఉక్రెయిన్‌లోని ఒడెసా నగరం నుంచి మాల్దోవాలోకి రష్యా సైన్యం ప్రవేశించాలంటే ఆమార్గంలో మరిన్ని దాడులు జరగాలి. రష్యా ప్రణాళిక, ఉక్రెయిన్‌పై దాడులకు సంబంధించి బెలారస్‌ అధ్యక్షుడు వారి అధికారులకు వివరించిన వీడియోను అధికార వెబ్‌సైట్‌లో పోస్టు చేశారు. అందులో మాల్దోవా దురాక్రమణ మినహా బెలారస్‌ నుంచి దాడులు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు సరిహద్దు ప్రాంతంలో తమ బలగాలను మోహరించినట్లు భద్రతామండలి సమావేశంలో  లుకషెంకో వెల్లడించారు. పోలండ్‌ సరిహద్దులోనూ సైన్యాన్ని అప్రమత్తంగా ఉంచామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.

అణ్వస్త్ర దేశంగా బెలారస్

మూడు రోజుల క్రితం బెలారస్ కొత్త రాజ్యాంగం ఆమోదానికి రిఫరెండం నిర్వహించారు. ఇది ఆమోదం పొందడం దాదాపు ఖాయం. ఇదే జరిగితే ఆ దేశం అణ్వస్త్రాలను సమకూర్చుకోవచ్చు. లుకషెంకో కూడా అదే అంటున్నారు. తాము అణ్వాయుధాలను రష్యాకు తిరిగిచ్చామని.. కానీ, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ను ప్రోత్సహిస్తున్నందు ఇకపై అణ్వాయుధాలను తిరిగి ఇచ్చేయమని అడుగుతామనిరిఫరెండం సందర్భంగా లుకషెంకో చెప్పారు.

మాల్డోవాతోనే ఆగుతారా?

సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయింది. ప్రస్తుతం రష్యా.. ఉక్రెయిన్ మీద పడింది. మాల్దోవా దిశగా కదులుతోంది. ఇకపై అంతటితో ఆగుతారా? అంటే చెప్పలేం. విడిపోయిన 15 దేశాల్లో రెండో అతి పెద్దది ఉక్రెయిన్. మొదటిది కజకిస్థాన్. ఉక్రెయినే రష్యా ధాటికివిలవిల్లాడుతుంటే.. మిగతా 13 దేశాలు రష్యాతో పెట్టుకుంటాయా? అంటే ఏమో చెప్పలేం? అదే జరిగితే పుతిన్ కలలుగంటున్న సోవియట్ యూనియన్ సాకారమైనట్లే. (బహుశా కజకిస్థాన్ తప్ప)
Tags:    

Similar News