సీఎస్ తో ఓఎస్డీ కలిసి వెళ్లిన ఎపిసోడ్ అసలు నిజం ఇదేనట

Update: 2023-02-06 10:09 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఒఎస్డీగా వ్యవహరిస్తున్న క్రిష్ణ మోహన్ రెడ్డి మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు హాజరు కావటం తెలిసిందే. ఆయనతో పాటు.. సీఎం జగన్ సతీమణి భారతి వద్ద పీఏగా పని చేసే నవీన్ కూడా ఇదే కేసు విచారణకు సీబీఐ ఎదుట హాజరుకావటం.. దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారణను ఎదుర్కోవటం తెలిసిందే.

అయితే.. సీబీఐ ప్రశ్నల తర్వాత బయటకు వచ్చిన ఒఎస్డీ క్రిష్ణమోహన్ ను.. ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెంటపెట్టుకొని వెళ్లారంటూ కొన్ని అగ్రపత్రికల్లో వచ్చిన కథనం పెను దుమారాన్ని రేపింది. ఒక ఒఎస్డీని.. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంట పెట్టుకొని వెళతారా? ఇంతకు మించిన అసాధారణ ఉదంతం ఇంకేమైనా ఉంటుందా? అన్న సందేహం వ్యక్తం కాగా.. జగన్ ప్రభుత్వంలో ఇలాంటివి సాధ్యమే అన్న వాదన కూడా వినిపించింది.

అయితే.. ఈ ఉదంతానికి సంబంధించి తాజా వెర్షన్ సీఎస్ జవహర్ రెడ్డి నుంచి వచ్చింది. తనపై వచ్చిన కథనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన జవహర్ రెడ్డి.. అసలేం జరిగిందన్న వివరాల్ని బయటపెట్టారు. అంతేకాదు.. తప్పుడు ప్రచారంతో సీఎస్ స్థాయిని దెబ్బ తీసిన మీడియా సంస్థలు.. వివరణను ప్రకటించి.. క్షమాపణలు కూడా చెప్పాలని అల్టిమేటం ఇచ్చారు. కావాలనే కుట్రపూరితంగా కథలు అల్లాయని.. జరిగిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.

తాజాగా ఆయన వెర్షన్ చూస్తే.. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం అహోబిలపురం సమీఫంలో రూ.5 కోట్లతో శ్రీ భానుకోట సోమేశ్వరాలయం మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 4న ఉదయం 9.58 గంటలకు జరపాలన్న నిర్ణయాన్ని నాలుగునెలల క్రితమే అంటే 2022 అక్టోబరు 14న నిర్ణయించారని.. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తాను వెళ్లినట్లుగా జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఫిబ్రవరి 2 రాత్రి11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం ద్వారా కడపకు చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. మూడో తేదీన ఉదయం  కడప కలెక్టర్.. ఇతర జిల్లా ఉన్నతాధికారులు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. అదే రోజు మధ్యాహ్నం తాను చదువుకున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ముద్దనూరులో విద్యార్థులతో సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు.

రాత్రి ఎనిమిది గంటల వేళలో రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్.. ఇతర అధికారులు తనకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారని.. స్పైస్ జెట్ లో 1డి సీటులో ప్రయాణించి హైదరాబాద్ కు వచ్చానని.. వాస్తవాలు ఇలా ఉంటే తనతో కలిసి ఓఎస్డీ విజయవాడ వెళ్లినట్లుగా.. ఒకే వాహనంలో ప్రయాణించినట్లుగా వార్తలు రావటం సరికాదంటూ భారీ వివరణ ఇచ్చారు. తనకు క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్న సీఎస్ జవహర్ రెడ్డి అల్టిమేటంకు సదరు మీడియా సంస్థలు ఎలా రియాక్టు అవుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News