లాడ్జీ ఎఫైర్ వివాదం: తీన్మార్ మల్లన్నపై కేసు !

Update: 2021-08-04 05:30 GMT
తీన్‌ మార్ మల్లన్న అలియాస్ నవీన్‌ కుమార్‌ .. గత కొన్ని రోజులుగా అధికార టీఅర్ ఎస్ కి కొరకరాని కొయ్యగా తయారైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను తీవ్రంగా ప్రశ్నిస్తూ చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. తీన్మార్‌ మల్లన్న వద్ద పనిచేసి మానేసిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారని తెలుస్తోంది. మల్లన్న తన క్యూ న్యూస్ చానల్‌ లో తన వ్యక్తిగత ఫొటోలను చూపించి పరువుకు భంగం కల్గించారంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు,మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలోని మల్లన్న కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. దాదాపు అరగంట పాటు తనిఖీలు నిర్వహించి, హార్డ్‌ డిస్క్‌, పెన్‌ డ్రైవ్‌ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్‌ ఉద్యోగులతో పాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లన్నకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ 67, ఐపీసీ 506, 509, 417 సెక్షన్ల కింద ఈ నెల 2న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం క్యూ న్యూస్‌‌ లో పనిచేసిన చిలుక ప్రవీణ్, తీన్మార్‌ మల్లన్న పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మల్లన్న వాటికి తన క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రవీణ్‌తో కొందరు యువతులు ఉన్న ఫొటోలను మల్లన్న స్క్రీన్‌ పై ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. అందులో తన ఫొటోలు కూడా ఉన్నాయని.. తాను కేవలం ప్రవీన్‌ కు స్నేహితురాలిని మాత్రమేనని, కానీ తన ఫొటోలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని యువతి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ 67, ఐపీసీ 506, 509, 417 సెక్షన్ల కింద ఈ నెల 2న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ప్రాథమిక దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తోంది.

యువతి ఫిర్యాదు ప్రకారం.. 'క్యూ న్యూస్‌ చానల్‌ లో నేను జనవరి 2020 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు రిపోర్టర్‌ గా పనిచేశాను. ఆ సమయంలో తీన్మార్‌ మల్లన్న విధానాలు, ట్రిక్కులు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేశా. తీన్మార్‌ మల్లన్న సోదరుడు వెంకటేశ్‌, మరికొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సహాయంతో కొన్ని అక్రమ అప్లికేషన్స్‌ను రూపొందించి వాటి ద్వారా చాలా మంది వ్యక్తిగత సమాచారాన్ని, క్యూ న్యూస్‌ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. దాని ఆధారంగా చాలా మందిపై బెదిరింపులకు పాల్పడేవాడు.

ఈ నెల 1న ఉదయం క్యూ న్యూస్‌ చానల్‌ లో మార్నింగ్‌ లైవ్‌ షోలో నాతో పాటు మరికొందరి అమ్మాయిల ఫొటోలను చూపుతూ, మాకు చిలుక ప్రవీణ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్టు చూపించాడు. చిలుక ప్రవీణ్‌తో ఉన్న గొడవల కారణంగా అతడిని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు నా ఫొటోలు వాడుకున్నాడు. యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో ఆ వీడియోలను చూపుతూ 'లాడ్జ్‌ వ్యవహారం' అని వ్యాఖ్యానించాడు. తీన్మార్‌ మల్లన్న చర్యల కారణంగా నా కుటుంబానికి ఉన్న విశ్వసనీయత, గౌరవానికి భంగం కలిగింది. బాధ్యుడైన తీన్మార్‌ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పొందుపరిచింది.



Tags:    

Similar News