ఫ్రెండ్ రూంలో ప్రేమికుల సూసైడ్.. కేపీహెచ్ బీఎల్ సంచలనం

Update: 2023-05-16 09:08 GMT
కష్టాలన్నవి మనుషులకే కానీ మిషన్లకు వస్తాయి. ఒకవేళ వస్తే.. వాటిని తీసి పక్కన పడేస్తారు. అలా పడేసినందుకు అవేమీ ఫీల్ కావు. కానీ.. ప్రాణమున్న మనిషి.. చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సూసైడ్ చేసుకున్న ప్రేమికులు ఇద్దరూ భీమవరం ప్రాంతానికి చెందిన వారు కావటం గమనార్హం.

పాతికేళ్లు నిండని ఈ ఇద్దరూ ఒకే గదిలో వేర్వేరు పద్దతిలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరిది ఒకే ఊరు మాత్రమే కాదు.. బంధువులు కూడా కావటం గమనార్హం. బతకం ఎందుకంత కష్టం అనుకున్నారో కానీ.. ఆత్మహత్య పేరుతో తమను తాము బలి పెట్టుకొని.. తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగిల్చారు. పోలీసులు.. ఫ్రెండ్స్.. బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే.. భీమవరం సమీపంలోని గొల్లవానితిప్పకు చెందిన 24 ఏళ్ల శ్యామ్.. 22 ఏళ్ల జ్యోతి బంధువులు. ఇద్దరిది ఒకే ఊరు. ఎంతోకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

శ్యామ్ బైబిల్ బోధనలో ట్రైనింగ్ తీసుకుంటుండగా.. జ్యోతి ప్రైవేటు జాబ్ చేస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై.. భర్త వేధింపులతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ మధ్యనే ఆమె హైదరాబాద్ కు వచ్చింది. వీరిద్దరూ వేర్వేరుగా హాస్టల్స్ లో ఉంటున్నారు. శ్యామ్ కు కేపీహెచ్ బీ ఏడో ఫేజ్ లో క్రిష్ణ అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి ఈ నెల 20న పెళ్లి ఉండటంతో తొమ్మిదిన ఊరికి వెళ్లిపోయాడు. గదిలో ఉండే స్నేహితుడు సైతం ఊరెళ్లాడు.

ఈ నెల 12న హైదరాబాద్ కు వచ్చిన శ్యామ్.. తనకు రూం తాళం చెవులు కావాలని అడిగాడు. దీంతో.. ఫలానా చోట తాళం ఉందని చెప్పటంతో దాన్ని తీసుకొని రూంలో ఉన్నాడు. రూంకు జ్యోతి వచ్చింది. అప్పుడప్పుడు వారిద్దరూ ఆ రూంకు వచ్చారని స్థానికులు చెబుతుంటారు.శనివారం నుంచి స్నేహితులు.. బంధువులు జ్యోతికి ఫోన్లు చేస్తుంటే ఎలాంటి సమాధానం లేదు. దీంతో.. ఆమె కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్రిష్ణ రూం నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. రూం కిటికీని తెరిచి చూడగా.. జ్యోతి కింద అచేతనంగా పడి ఉంటే.. క్రిష్ణ ఉరేసుకున్న వైనం కనిపించింది. వారి ఫోన్ల ఆధారంగా నెంబర్లు సేకరించిన పోలీసులు.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గదిలో మందుబిళ్లల స్ట్రిప్ దొరికింది. నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. పెళ్లి చేసుకోవటానికి రెండు కుటుంబాల వారు ఒప్పుకోకపోవటంతోనే.. వేరే మార్గం లేక వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్నేహితుడి రూంలో ఆత్మహత్య చేసుకోవటం ద్వారా.. రూంలో ఉండేందుకు ఓకే చెప్పిన స్నేహితుడు క్రిష్ణకు ఎదురయ్యే కష్టం గురించి ఈ ప్రేమికులు ఇద్దరు కాస్తంత ఆలోచించినా బాగుండేదన్న మాట వినిపిస్తోంది.

Similar News