రాజధాని లేని ఏపీని చూసి అంతా నవ్వుతున్నారు.. ఆ మాట అన్నదెవరంటే?

Update: 2022-09-12 04:31 GMT
ఏపీని చూస్తే అందరికి నవ్వులాటే.. ఎందుకంటే.. ఏపీ నాదీ అన్నభావన వ్యక్తిగతంగా.. మాదీ అన్న మాట ఉమ్మడిగా ఫీలయ్యే భావోద్వేగం ప్రజల్లో ఉండకపోవటమే. తాము నమ్మిన నాయకులు.. నచ్చిన అధినేతల నోటి నుంచి వచ్చిందే నిజమని తప్పించి.. న్యాయం ఏమిటి? అన్యాయం ఏమిటి? అన్న విషయంపై విచక్షణ ఉన్నా.. అప్పుడెప్పుడో.. అదేదో విషయానికి జరిగిన అంశాల్ని ఇప్పటి అంశాలకు లంకె వేసుకొని.. ఒక వాదనను వినిపిస్తూ తమను తాము మోసం చేసుకునే తీరు ఏపీ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

ఉమ్మడి రాష్ట్రం కాస్తా ముక్కలు అయ్యాక కూడా.. పోయిన ముక్క మీద బాధ.. విడిపోయామన్న ఆవేదన.. దానికి తమ తీరు కూడా కారణమా? అన్న ఆత్మవిమర్శ  చాలా చాలా అవసరం. కానీ.. అలాంటిదేమీ లేకపోవటం ఒక సమస్య. నిజానికి ఈ భావన ఇప్పుడు లేకుంటే భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ రోజుకు కూడా ఏపీ మూడు ప్రాంతాల సమాహారం. భిన్న వాతావరణం.. విభిన్న పరిస్థితులు.. సంస్కృతుల సమాహారంగా చెప్పాలి. అలాంటి రాష్ట్రం ఒకటిగా ఉండాలంటే..  సమైక్య భావనలు తప్పనిసరి. ఆంధ్రోళ్లమని గొప్పలు చెప్పుకునే ఒక ప్రాంతానికి చెందిన ప్రజలకు ప్రజా రాజధాని లేకపోవటానికి మించిన బ్యాడ్ లక్ ఇంకేం ఉంటుంది?

ఆ విషయాన్ని ఇప్పటికి గమనించకుండా.. రాజకీయ క్రీడలో ప్రజలు భాగస్వామ్యం కావటం.. రాజధాని ఏదైనా వెంటనే పూర్తి చేయాలన్న విషయాన్ని బలంగా చెప్పే విషయంలో జరుగుతున్న తప్పులు.. మిగిలిన రాష్ట్రాల ప్రజల ముందు చులకనగా.. నవ్వులాటగా మారామన్నది మర్చిపోకూడదు. ఏపీ రాజధాని అమరావతి చోటు చేసుకున్న వివాదాలు.. జరుగుతున్న పరిణామాల విషయాలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ఆయన.. రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ నుంచి ప్లానింగ్ వరకు ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలించారు. అమరావతి కోసం వెయ్యి రోజులుగా జరుగుతున్న ఉద్యమం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాల్ని ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తై.. రెండో సీఎం పదవీకాలం త్వరలో ముగిసిపోతున్నా.. రాజధానికి అతీగతీ లేకపోవటం చూసి ఆంధ్రజాతి ఇంతేనని అందరూ మనల్ని చూసి నవ్వుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా పేర్కొంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా అర్థం చేసుకుంటామని చెబితే కుదరదని.. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటుకు తమకున్న వెసులుబాటు ఇదీ అన్న విషయాన్ని చెబితే కొంత సబబుగా ఉండేదే తప్పించి చంద్రబాబు ఏం చేశారో నాకనవసరం.. అది నాకు నచ్చలేదు.. నాకు ఇష్టం వచ్చిందని చేస్తానని ముఖ్యమంత్రి.. మంత్రులు మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనలన్నీ విన్న తర్వాత హైకోర్టు రాజధానిపై తీర్పు చెప్పిందని.. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదు కాబట్టిఈ రోజుకి హైకోర్టు తీర్పే ఫైనల్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా మూడు రాజధానులపై ముందుకు వెళ్లే ముందు వెసులుబాటు ఉందని వారు అనుకుంటే అదే విషయాన్ని చెప్పాలన్నారు. అంతేకానీ.. తమ ప్రభుత్వం చిన్నప్పటి నుంచి మూడు రాజధానులగురించి మాట్లాడుతుంది కాబట్టి.. దానికే కట్టుబడి ఉన్నామని చెప్పటం సబబు కాదన్నారు. నిజమే కదా!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News