తనకు తాను ఓటేసుకోలేని మాజీ మంత్రి

Update: 2016-04-25 04:36 GMT
ఆయనో మాజీ మంత్రి. నియోజకవర్గంలో ఆయనగారి పరపతి అరచేతి మందాన ఉంది. అన్ని బాగా ఉంటే అయ్యగారి గురించి అనుకోవాల్సిన పనేం ఉంది. ప్రజాభిమానంతో పాటు ఆయన మీదన స్కాం ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగా అయ్యగారి మీద కేసు పెట్టి లోపలేశారు. షెడ్యూల్ లో భాగంగా ఎన్నికలు వచ్చేశాయి. జైల్లో ఉన్నా పోటీకి సై అనేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కినా.. తాను బరిలో ఉన్న ఎన్నికల్లో తన ఓటును తనకు వేసుకునే ఛాన్స్ మాత్రం మిస్ అయ్యారు. ఈ విచిత్ర ఉదంతం పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ అధికారపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమర్ హతి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న మదన్ మిత్ర ఉదంతమిది.

బెంగాల్ తో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలతో  మదన్ మిత్రను 2014లో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుపాలు చేశారు. అయినప్పటికీ ఆయన తాజా ఎన్నికల బరిలో ఉన్నారు. పోటీ చేసే అవకాశం ఉన్నా.. ఎన్నికల సందర్భంగా ఓటు వేసే వీలు చిక్కని ఆయన.. తన ఓటును తాను వేసుకోలేక విపరీతంగా బాధ పడిపోతున్నారు. ఇక.. ఆయన కుటుంబ సభ్యులు.. అనుచరులు.. అభిమానుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదంటున్నారు. తప్పులు చేసినప్పుడు ఆ మాత్రం శిక్ష లేకపోతే ఏం బాగుంటుంది..?
Tags:    

Similar News