కూట‌మిలో అస్ప‌ష్ట‌త‌...కొన‌సాగ‌డం క‌లేనా?

Update: 2019-02-07 06:19 GMT
తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఐక్య‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడిచిన పొత్తు మ‌రో ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం లేద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు గడచినా ప్రజాకూటమి సమావేశం ఇప్పటి వరకూ జరగకపోవ‌డంతో ఈ చ‌ర్చ‌ జ‌రుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలసి పోటీ చేయటంతో భారీ మూల్యమే చెల్లించుకో వాల్సి వచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలు ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేయ‌డంతో...కూట‌మి భ‌విష్య‌త్ ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.  దీంతోపాటుగా, ఆయా పార్టీల నేత‌లు చేస్తున్న కామెంట్లు సైతం కూట‌మి భ‌విష్య‌త్‌ ను ప్ర‌శ్నార్థకం చేస్తున్నాయ‌మ‌ని అంటున్నారు.

ప్రజాకూటమి పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా బలనిరూపణ కోసం కూటమి పార్టీలు విడి విడిగానే ప్రయత్నించాయి. ప్రజాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగలేదని నాలుగు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రాబోయే లోక్‌ సభ ఎన్నికల్లో పొత్తులపై ఎవరూ ఆసక్తి చూపటం లేదు. ప్రజాకూటమికి చైర్మన్‌ గా ఉన్న కోదండరాం కూడా జాతీయ స్థాయిలో జరిగిన ఒకటి రెండు సమావేశాల్లో పాల్గొనడం మినహా రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకూ ఇతర పార్టీల నేతలను కలవలేదు. కూటమి సమావేశం ఏర్పాటు చేయాలనే ప్రస్తావన కూడా జరగలేదు. ఈ సమావేశం అసలు జరుగుతుందా లేదా అనే అంశంపై కూడా ఎవరూ స్పష్టతనీయటం లేదు.

తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే తమకు నష్టం జరిగిందని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారంపై  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ మాట్లాడుతూ ఎవరి అభిప్రాయం వారిదన్నారు. లోక్‌ సభ ఎన్నికల గురించి తమ పార్టీలో ఇంకా చర్చ జరగలేదన్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి చంద్రబాబు నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని వివ‌రించారు. కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదు నేప‌థ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పందిస్తూ లోక్‌ సభలో కూటమి పార్టీల మధ్య పొత్తులు ఉంటాయో లేదో చెప్పలేమని  అన్నారు. ఈ నెల 10 వ తేదీ తర్వాత దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు. వామపక్ష పార్టీల మధ్య ఐక్యత అవసరమేనని అందుకు తమ పార్టీ జాతీయ స్థాయిలో కూడా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. పొత్తులు ఉన్నా లేకున్నా తమ పార్టీకి బలం ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.
Tags:    

Similar News